Diabetes | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. అనుక్షణం పనిఒత్తిడితో సతమతమయ్యేవారెందరో. వేళకు తిండి.. సరైన నిద్ర..ఏమాత్రం శారీరక శ్రమ లేని పనులు, ఆహారపు అలవాట్లు మధుమేహానికి దారితీస్తున్నాయి. అర్ధరాత్రిళ్లు తినడం.. తిన్న వెంటనే పడుకోవడంతో చాపకింద నీరులా తియ్యగా దరిచేరి, ప్రాణాలు తీస్తోందీ మహమ్మారి.. షుగర్ వ్యాధి. 15ఏండ్ల క్రితం 50ఏండ్ల వయస్సు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి.. ప్రస్తుతం 30ఏండ్లు..18ఏండ్లతోపాటు ఇంకొందరికి పుట్టుకతోనే వస్తున్నది.
ఏదైనా శస్త్రచికిత్స జరిగినప్పుడే ఈ వ్యాధి వచ్చిందన్న విషయం రోగులకు తెలుస్తోంది. ఆలోపే వ్యాధి ముదురుతుండటంతో బాధితుల్లో ఆందోళన మొదలవుతున్నది. ఇలాంటి మధుమేహ బాధితుల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో 70మిలియన్ల మందికిపైగా షుగర్‌తో బాధపడుతుండగా హైదరాబాద్‌లో 20.5శాతం మంది ఉన్నట్టు ‘నేషనల్ అర్బన్ డయాబెటీస్’ జరిపిన సర్వేలో బయటపడింది.
మధుమేహానికి ప్రధానంగా కండ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె తదితర అవయవాలు ప్రభావితమవుతున్నాయి. వ్యాధి వస్తే అతిగా అకలి, నీరసం, అతి మూత్రం, దాహం, బరువు తగ్గిపోవడం, చూపు మందగించటం తదితర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తిస్తే రాకుండా నివారించవచ్చు. ‘ప్రీ-డయాబిటిస్’ దశలోనే వైద్యులను సంప్రదిస్తే వ్యాధిని ఆదిలోనే నియంత్రించవచ్చు. 50శాతం మందిలో లక్షణాలు కనిపిస్తుండగా, మిగతా వారికి కేవలం వైద్య పరీక్షల ద్వారానే బహిర్గతమవుతుంది. ప్రీ-డయాబిటిస్ దశలో గుర్తించాలంటే ఆరునెలలకు ఒక్కసారైనా ప్రజలు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకముందే జాగ్రత పడడం ఉత్తమం.
– డాక్టర్ బియాట్రిస్ ఆని, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్