హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 2,600 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు రెండు నెలల జీతాలు మంగళవారం జమ అయ్యాయి. ‘మూడు నెలల నుంచి జీతాలు లేవు’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ దవాఖానల్లో వీరంతా ఎక్స్రే, ల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్లు, బ్లడ్ బ్యాంక్, పేషెంట్ కేర్, ఆయాలు, శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి మూడు నెలల నుంచి జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కథనాన్ని ప్రచురించగా స్పందించిన ప్రభుత్వం వారికి రెండు నెలల జీతాలు జమ చేసింది. జీతాలు జమ కావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేసి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.