హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)/ నమస్తే తెలంగాణ నెట్వర్క్ : పదినెలలుగా రాష్ట్రంలోని గురుకులాల ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గేట్లకు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా బీసీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల భవనాలకు తాళాలు పడడంతో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆరు బయటే ఎండలో నిరీక్షించారు. గత్యంతరం లేదని భావించిన సర్కారు సాయంత్రంలోగా రెండు నెలల బకాయిలు వి డుదల చేసింది.
ఎస్సీ, మైనార్టీ గురుకులాలకు రెండు నెలలు, బీసీ మైనార్టీ గురుకులాలకు మూడు నెలల బకాయిలు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా 500 వరకు అద్దె భవనాల్లోనే బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి నెలకు రూ.2 లక్ష ల చొప్పున 10 నెలలకుగాను రూ.20 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యజమానుల సంఘం పిలుపుమేరకు మంగళవా రం ఆయా భవనాలకు యజమానులు తాళా లు వేశారు. గురుకుల సొసైటీల కార్యదర్శుల కు వినతిప్రతాలు సమర్పించిన, ప్రిన్సిపాళ్లకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భవనాలకు తాళాలు వేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్టు పేర్కొన్నది. మిగతా బకాయిలు త్వరగా కట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాగా విద్యాబోధనకు ఆటంకం కలిగించారన్న కారణంతో యజమానులపై కేసులు నమోదయ్యాయి.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని తాకిన గురుకులాల ఖ్యాతి, కాంగ్రెస్ పాలనలో అధఃపాతాళానికి దిగజారిందని, ప్రభుత్వం అద్దె కట్టకపోవడంతో యాజమానులు గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి రావడం దారుణమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ‘గురుకులాల అద్దె చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామనడం.. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్త అన్నట్టుగా ఉన్నది’ అని ఎద్దేవాచేశారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఓ ప్రకటనలో విమర్శించారు. కనీసం గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టలేని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టేందుకు సమయం ఉంది కానీ, ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ మీద ఒక్క సమీక్ష పెట్టే సమయం లేదా? అని ప్రశ్నించారు.
పెండింగ్ కిరాయిలు చెల్లించాలని సె ప్టెంబర్ 20న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల కార్యదర్శులకు వినతిపత్రాలు సమర్పించినం. అయినా స్పందించకపోవడంతో 30న కార్యాచరణ ప్రకటించినం. ప్రిన్సిపాళ్లకు నోటీసులు ఇచ్చి నం. అయినా పట్టించుకోకపోవడంతో గురుకుల బిల్డింగ్ గేట్లకు తాళలు వేసి నిరసన తెలిపినం. కిరాయిలు సకాలం లో రాక ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకు వారు భవనాలను జప్తు చేస్తామని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో తాళా లు వేయాల్సి వచ్చింది. ప్రభుత్వం 2 నెలల కిరాయి విడుదల చేసింది.
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లాల కలెక్టర్లకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీచేశారు. గురుకుల ప్రిన్సిపాళ్లను యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా అకడి నుంచి ఖాళీ చేసి వేరే భవనాలు చూడాలని సూచించారు. నేడో రేపో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గురుకుల స్కూళ్ల గేట్లకు పెట్టిన బ్యానర్లు వెంటనే తొలగించాలని, విద్యార్థులకు సక్రమంగా తరగతులు నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
‘ఢిల్లీకి పంపేందుకు డబ్బుల మూటలున్నయ్.. గురుకుల భవనాల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘కమీషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేలకోట్లున్నయ్ కానీ పేద విద్యార్థులు చదువుకొనే గురుకుల పాఠశాలల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా? సిగ్గు, సిగ్గు.. ఇది గురుకులాలను శాశ్వతంగా మూసేసే కుట్ర లాగా కనబడుతున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెండింగ్‌లో ఉన్న గురుకుల భవనాల కిరాయిలను తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రీ.. గురుకులాల అద్దె ఇంకెప్పుడు చెల్లిస్తరు?’ అని ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించక సూల్ గేట్లకు తాళం వేసిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా మారిందనేందుకు ఇదే నిదర్శనం.రోజురోజుకూ దిగజారుతున్న విద్యావ్యవస్థ గురించి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు ఇంకెప్పుడు పట్టించుకుంటరు?’ అని నిలదీశారు.