Hit and Run | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో గాయపడినా, మరణించినా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ం ప్రవేశపెట్టిన ‘హిట్ అండ్ రన్’ పథకంపై జనంలో అవగాహన కొరవడింది. 2022లో అమల్లోకి వచ్చిన ఈ పథకం గురించి బాధితులకు తెలియకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఏదైనా గుర్తుతెలియని వాహనాలు ఢీకొట్టి వెళ్లిపోతే, ప్రమాదంలో గాయపడ్డా, చనిపోయినా ‘హిట్ అండ్ రన్’ చట్టం కింద కేసు నమోదవుతుంది. గాయపడితే ఆ వ్యక్తికి రూ.50వేలు, మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది.
సాయం ఎలా పొందాలి?
‘హిట్ అండ్ రన్’ పరిహారం పొందాలంటే 2 రకాల దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. బాధితులు ఫారం(1) ద్వారా ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? ఏ విధమైన గాయాలయ్యాయి? చికిత్స వివరాలతో దరఖాస్తు ఫారం నింపాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు జతచేయాలి. ప్రమాదంలో బాధితులు చనిపోతే మృతుల కుటుంబ సభ్యులు తమ బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ జత చేయాలి. దవాఖానలో సొంత నగదుతో చికిత్స పొంది, ఆ తర్వాత రీఫండ్ పొందేందుకు ఫారం(4) ద్వారా దరఖాస్తు తీసుకోవాలి. చికిత్స పొందిన దవాఖాన, ఖర్చు రసీదులు, ఎఫ్ఐఆర్ కాపీ, మృతి చెందితే పోస్టుమార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్ జత చేసి రెవెన్యూ, పోలీసు అధికారులకు సమర్పించాలి. అధికారులు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక పంపిస్తారు. అధికారులు తుదివిచారణ జరిపి 15 రోజుల్లో బాధితుల ఖాతాలో నగదును జమ చేస్తారు.
అవగాహన లేక.. సాయం అందక
‘హిట్ అండ్ రన్ ’ సీమ్ అమలు పోలీస్, రెవెన్యూ అధికారులపై ఆధారపడి ఉంటుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తారు. ప్రమాదానికి గురైన వ్యక్తి మరణిస్తే ఆర్డీవోకు ఎఫ్ఐఆర్ కాపీ, పూర్తి సమాచారంతో రిపోర్టు అందించాలి. ఆర్డీవో విచారణ చేసి ప్రమాదంలో గాయపడిన లేదా మృతి చెందిన వ్యక్తుల వివరాలను పరిశీలించి, నివేదికను కలెక్టర్కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి, బాధితులు చనిపోతే రూ.2లక్షలు, గాయాలపాలైతే రూ.50వేలు సాయం అందజేయాలి. కానీ పథకం ప్రారంభించి మూడేండ్లు కావొస్తున్నా ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసు, రెవెన్యూ అధికారులు చొరవ చూపడం లేదని పలు ప్రమాద కేసుల్లో స్పష్టమవుతున్నది. చాలామంది అధికారులకు కూడా పథకం గురించి తెలియకపోవడంతో బాధితులకు సాయం అందడంలేదు.