హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : దేశంలో నానాటికీ రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండగా, హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది నగరంలో ప్రతి లక్ష మందిలో 54 మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం తాజాగా వెల్లడించింది. హైదరాబాద్ తర్వాతి స్థానంలో ప్రతి లక్ష మందికి 46.7 కేసులతో బెంగళూరు నిలిచింది. చెన్నై (45.4), అలప్పుజ(42.2), తిరువనంతరపురం (40.7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 2.38 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నట్టు ఆ అధ్యయనం పేర్కొంది. గతంలో ఎన్నడూ లేనంతగా 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది.
హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో ప్రతి నెల సగటున 120-130 కొత్త కేసులు నమోదవుతుండగా.. ఏడాది మొత్తంలో దాదాపు 1600 కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ తంలో ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో ప్రతి నెల 70-75 కేసులు నమోదయ్యేవని, ఇటీవలి కాలంలో ఆ సంఖ్య వంద దాటుతున్నదని దవాఖాన వర్గాలు తెలిపాయి. గర్భాశయ క్యాన్సర్ కేసులు తగ్గి, రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు వెల్లడించాయి. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల్లో సైతం ప్రతి నెల పదుల సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు దవాఖానాల్లోనూ ప్రతి నెల వందల సంఖ్యలో రొమ్ముక్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఊబకాయం, మద్యపానం, అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, 12 ఏండ్లలోపే రుతుక్రమం ప్రారంభం కావడం, 30 ఏండ్ల తర్వాత మొదటి బిడ్డను పొందిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఏడాది అన్ని రకాల క్యాన్సర్ కేసులు 55 వేల వరకు నమోదవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ప్రతి నెల సుమారు 4,500 వరకు కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా రొమ్ముక్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతి 28 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం క్యాన్సర్‌కు కారణమవుతున్నది. దాదాపు అన్ని ఆహార పదార్థాల కారణంగా హార్మోన్ల శాతం పెరుగుతున్నది. వయస్సు 40 ఏండ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. మహిళలు మామోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడానికి చేసే పరీక్ష) తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ గడ్డ ఆవగింజ సైజులో ఉన్నప్పుడే గుర్తించవచ్చు. ఆ తర్వాత 95 శాతం చికిత్స ద్వారా క్యాన్సర్‌ను నయం చేయొచ్చు. పరీక్ష చేయించుకోవడానికి మహిళలు భయపడొద్దు.. ధైర్యంగా పరీక్ష చేయించుకోవాలి.