హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): పహల్గాం చర్యకు పాకిస్థాన్ మూల్యం చెల్లించాల్సిందేనని మహావీర చక్ర అవార్డు గ్రహీత, 1971నాటి యుద్ధ వీరుడు ఎయిర్ వైస్ మార్షల్ సిసిల్ వివియన్ పార్కర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని వాయుపురిలో నివాసమున్న పార్కర్ వయస్సు ఇప్పుడు 93 ఏండ్లు. తాను పాక్షికంగా అంధుడనని, పాక్షికంగా బధిరుడనని చెప్పుకొనే పార్కర్ తన ఇంటి పనులతో నిత్యం బిజీగా ఉంటారు. కానీ సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాత్రం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. తాజా పరిణామాలపై ఆయనను సంప్రదించినప్పుడు ‘పహల్గాంకు పాకిస్థాన్ మూల్యం చెల్లించాల్సిందే’నని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ మూల్యం చెల్లించటం ప్రారంభించిందని చెప్పారు.
రెండు యుద్ధాలలో కీలక పాత్ర
ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో జీవించి ఉన్న మహావీరచక్ర అవార్డు గ్రహీత పార్కర్ ఒక్కరే.1965, 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధాలలో భాగస్వామిగా ఉన్నారు. పాకిస్థాన్‌తో 1971, డిసెంబర్లో యుద్ధం ప్రారంభం కాగానే వింగ్ కమాండర్‌గా ఉన్న పార్కర్‌కు హాకర్ హంటర్స్‌గా పేరొందిన 20వ స్కాడ్రన్ బాధ్యతలు అప్పగించారు. ఈ దళం పాక్ సైనిక శ్రేణులపై చేపట్టిన అనేక మిషన్లను విజయవంతంగా పూర్తిచేసింది.
చొరబడి దెబ్బతీసిన ధీరుడు
పాక్‌పై దాడి జరిపి తిరిగి వస్తున్న భారత యుద్ధ విమానాలపై సేబర్ విమానాలు దాడి చేశాయని, దీంతో పార్కర్ స్వయంగా ఒక సేబర్‌ను కూల్చివేశారని, మరో దానిని తీవ్రంగా ధ్వంసం చేశాడని ప్రభుత్వం ఆయనకిచ్చిన మహావీరచక్ర ప్రశంసా పత్రంలో పేర్కొంది. పాక్ వైమానిక దళానికి చెందిన మ్యురిడ్ వైమానిక స్థావరంపై దాడిచేసిన పార్కర్ దళం మరో ఐదు సేబర్ విమానాలను ధ్వంసం చేసిందని తెలిపింది. అటోక్ ఆయిల్ రిఫైనరీపై దాడి కూడా ఆయన నాయకత్వంలోనే జరిగింది. ఆయిల్ రిఫైనరీ విధ్వంసం దక్షిణాసియాలోనే అగ్ని ప్రమాదంగా పేరొందింది.
ఈ పరాక్రమానికే ప్రభుత్వం ఆయనకు మహావీర చక్రను బహూకరించింది. ఆ తరువాత ఎయిర్‌వైస్ మార్షల్‌గా పదోన్నతి పొందిన పార్కర్ 1986లో పదవీ విరమణ పొందారు. పైలట్‌గా తన 35 ఏండ్ల సర్వీసులో ఆయన 22 రకాల యుద్ధ విమానాలను 3850 గంటలపాటు నడిపారు. పార్కర్ తన అనుభవాలను ‘ఎయిర్లూమ్స్-ర్యాండమ్ రీకలెక్షన్స్ ఆఫ్ ఏన్ ఏన్షెంట్ ఏవియేటర్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. పాక్‌తో యుద్ధం ముగిసిన 47 సంవత్సరాల తరువాత 2018లో.. పాక్‌లోని మ్యురిడ్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిపింది పార్కర్ నేతృత్వంలోని 20వ స్కాడ్రన్ అని మాజీ ఫైటర్ పైలట్ ఎయిర్ కామడోర్ ఎం కైసర్ టుఫెయిల్ (రిటైర్డ్) ధ్రువీకరించారు.