పట్టణాభివృద్ధికి 1950 కోట్లివ్వండి

- వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించండి
- వరంగల్‌లో నియో మెట్రోకు సాయమందించండి
- కేంద్రమంత్రులు హర్దీప్సింగ్పురి, నిర్మలా సీతారామన్‌కు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజధాని హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పురపాలకశాఖ ఆధ్వర్యం లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు రూ.1,950 కోట్లు ఇవ్వాలని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేస్తూ కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్దీప్సింగ్పురి, కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం లేఖలు రాశారు.
దీర్ఘకాలిక అభివృద్ధి పనుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లానింగ్ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకుపోతున్నదని, ఇందుకోసం ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాలు నిర్ధారణ వంటివి పూర్తిచేశామని వివరించారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతోపాటు మురుగునీటి ట్రంక్‌లైన్ల ఏర్పాటు వంటి వాటితో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూసీనది కాలుష్యాన్ని అరికట్టే చర్య లు తీసుకోవాలంటూ కొద్ది రోజుల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఎస్టీపీలతోపాటు సివరేజ్ కలెక్షన్ నెట్వర్క్ ట్రంక్, సివర్లైన్ల నెట్వ ర్క్ కలిపి మొత్తం 2,232 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నదని, వీటికోసం సుమారు రూ.3,722 కోట్లతో 36 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్‌కు కేంద్రప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు సుమారు రూ.750 కోట్లు కేటాయించాలని కోరారు.
13 వేల కోట్లతో వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం రూ.258 కోట్లతో చేపట్టిన కార్యక్రమానికి టెండర్లు పూర్తయ్యాయని, పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల లెగసి డంపును రూ.520 కోట్లతో బయోమైనింగ్, రేమెడియేషన్ చేస్తున్నామని వివరించారు. 76 పురపాలికల్లో మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ల పను లు ఇప్పటికే పూర్తయ్యాయని, రూ.250 కోట్ల అం చనా వ్యయంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు 57 పురపాలికల్లో రూ.13,228 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టుకు నిధులు అవసరమవుతాయని, అందులో మొదటిదశ కింద 30 పట్టణాల్లో రూ.2,828 కోట్లతో పనులు చేపట్టాలని యోచిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది రూ. 3,777 కోట్లతో వివిధ పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని,ఇందులో కనీసం 20 శాతం రూ. 750 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రులకు రాసిన లేఖల్లో కేటీఆర్ కోరారు.
వరంగల్‌లో నియో మెట్రో రైలు
హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణమైన వరంగల్‌లో ప్రస్తుత, భవిష్యత్ అవసరాల కోసం ప్రజారవాణా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 15 లక్షలు ఉన్న వరంగల్ జనాభా 2051 నాటికి 35 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నదని.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో మహారాష్ట్రలోని నాసిక్ తరహాలో నియో మెట్రో ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నియో మెట్రోకు సంబంధించిన ప్రమాణాలు, ప్రత్యేకతలకు కేంద్రప్రభుత్వం తుదిరూపు ఇచ్చిన నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సుమారు 15.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌కు రూ.1,050కోట్ల ఖర్చవుతుందని, ఇందులో 20 శాతం నిధులు అంటే రూ. 210 కోట్ల ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో కేటాయించాలని కోరారు.
నాలాల అభివృద్ధికి రూ.1,200 కోట్లు
హైదరాబాద్‌లో మునుపెన్నడూ లేనివిధంగా వచ్చిన వరదలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాలాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులోభాగంగా నగర పరిధిలోని నాలాలు, వాటర్డ్రైన్లను అభివృద్ధి చేసేందుకు వివిధ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1,200 కోట్ల వార్షిక ప్రణాళికను సిద్ధం చేశామని, కనీసం 20 శాతం అంటే రూ.240 కోట్లను కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు.
తెలంగాణ ఆర్థిక ఇంజిన్ హైదరాబాద్‌లో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఏరియా పేరిట పలు ర్యక్రమాలు చేపడుతున్నాం. సమగ్ర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తోపాటు, మురుగునీటి ట్రంక్‌లైన్ల ఏర్పాటుతో మొత్తం 2,232 కిలోమీటర్ల మేర సుమారు రూ.3,722 కోట్లతో 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. నాలాలు, వాటర్ డ్రైన్ల అభివృద్ధికి పనులు చేపడుతున్నాం. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో అభివృద్ధి పనులు, వరంగల్‌లో నియో మెట్రోరైల్‌కు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
- కేంద్రమంత్రులకు రాసిన లేఖల్లో కేటీఆర్
తాజావార్తలు
- గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్' భద్రత
- అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్
- పాత రూ.100 నోట్లు ఔట్
- మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి
- హై హై.. నాయకా
- అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం
- పంటల కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ నిఖిల సమీక్ష
- రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలి
- కొవిడ్ టీకా వేయించుకోవాలి
- జనగామ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎం