సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు సమ్మర్లో తెగ ఎంజాయ్ చేయాలనుకుంటారు. పల్లెటూర్లకు వెళ్లే వాళ్లు కొందరైతే స్విమ్మింగ్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్యారం, చెస్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ తదితర స్పోర్ట్స్‌లలో ప్రతిభ చాటాలని భావిస్తుంటారు. ఇందుకు, జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులను ఎంచుకుంటారు. జీహెచ్ఎంసీ కూడా క్రీడలకు పెద్ద పీట వేస్తూ ప్రతి సంవత్సరం పిల్లలకు విద్యతో పాటు ఆట పాటలు అవసరం ఉందంటూ ఔట్ డోర్, ఇండోర్ స్పోర్ట్స్‌తో పాటు పెయింటింగ్ తదితర మనో వికాసాన్ని పెంచే ఫన్నీ గేమ్స్‌లలో శిక్షణ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పిల్లలకు సమ్మర్ హాలీడేస్ రావడం, ఆటల పట్ల ఆసక్తి కనబరిచే చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులను సిద్ధం చేసింది. రేపటి (గురువారం) నుంచి వచ్చే నెల 31వరకు 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 353 క్రీడా మైదానాలలో ఆరేండ్ల నుంచి 16 ఏండ్ల వయస్సు గల బాల బాలికలలో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏడు లాగే.. ఈ సారి వేసవి శిక్షణ తరగతలను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ మేరకు 2024 వేసవి శిక్షణ తరగతుల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. 44 క్రీడలతో పాటు 16 స్విమ్మింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ సారి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా జీహెచ్ఎంసీ అధికారులే ప్రారంభోత్సవాలు, ముగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నెల 17న విక్టరీ ప్లే గ్రౌండ్లో స్పోర్ట్స్ గేమ్ ఇన్స్పెక్టర్లు, కోచ్‌లు, ప్లేయర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరు జోన్లలో రోజుకో జోన్ చొప్పున కోచ్‌లతో సమావేశం నిర్వహించి క్రీడా సామగ్రికి సంబంధిత బాధ్యులకు అప్పగించారు. ఈ నెల 25న సమ్మర్ కోచింగ్ క్యాంపులను ప్రారంభించి, వచ్చే నెల 6వ తేదీ నుంచి స్పోర్ట్స్ క్విజ్ పోటీలు, పదో తరగతి, ఇంటర్ సెంటర్లకు టోర్నమెంట్స్ మే 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, చెస్, క్యారమ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డి, రోలర్ స్కేటింగ్, సిపాక్ త్రో, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్ కలిపి మొత్తం 16 రకాల క్రీడా టోర్నమెంట్లను నిర్వహించనున్నారు. వచ్చే నెల 27 నుంచి 31వ తేదీ వరకు రోజుకో జోన్లో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమాలు చేపట్టి విజేతలను అవార్డులను ప్రదానం చేయనున్నారు. స్పోర్ట్స్ కోచ్ క్యాంపులలో రిజిస్ట్రేషన్‌కు రూ.50 ఫీజు షటిల్ బ్యాడ్మింటన్, రోలర్, స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ ఇతర గేమ్‌లకు రూ.10 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు www.sports, ghmc.gov.in నమోదు చేయాలని అధికారులు సూచించారు.