హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపకశాఖ మరింత బలోపేతం కానున్నది. 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర అగ్నిమాపశాఖకు రూ.190.14 కోట్లు (రాష్ట్ర వాటా రూ.47.53 కోట్లు) రానున్నాయి. ఇటీవల ఢిల్లీలో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం దేశంలోనే తొలిసారిగా ఎంవోయూ కుదుర్చుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నిధుల విడుదలకు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి తీవ్రంగా కృషి చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో రూ.85.57 కోట్లతో వాహనాలు, యంత్రసామగ్రిని కొనుగోలు చేయనున్నారు. వీటిల్లో 104 మీటర్ల ఎత్తులో కూడా మంటలను ఆర్పగలిగే హైడ్రాలిక్ వాహనం, 32 మీటర్ల ఎత్తులో మంటలను అదుపుచేసే హైడ్రాలిక్ వాహనాలు, 68 మీటర్ల ఎత్తులో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉపయోగించే నిచ్చెనలు, 4 ఫైర్ ఫైటింగ్ రోబోలు, రెస్క్యూ బోట్లు, క్విక్ రెస్పాన్స్ వాహనాలు, హై ప్రెజర్పంప్స్ వంటివి ఉన్నాయి. అర్బన్ స్టేషన్లలో అప్‌గ్రేడేషన్, కంట్రోల్ సెంటర్, జీపీఎస్, వైర్లెస్ సాంకేతిక వ్యవస్థల కోసం రూ.9.50 కోట్లను ఖర్చు చేయనున్నారు. వీటితోపాటు ట్రైనింగ్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచేందుకు, శిక్షణ పొందేవారి మెరుగైన వసతుల కల్పనకు, సాంకేతికతతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు రూ.9.51 కోట్లను వెచ్చించనున్నారు. రాష్ట్ర అగ్నిమాపశాఖ ప్రత్యేక వినతులు, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ఖర్చులకు రూ.28.52 కోట్లను కేటాయించారు.
18 కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణం
కేంద్రం ఇచ్చే తాజా నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 18 చోట్ల అగ్నిమాపక కేంద్రాలను నిర్మించనున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా పునర్విభజన అనంతరం 2017లో కొత్తగా 18 ఫైర్స్టేషన్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి సరిపడా నిధులు లేకపోవడంతో తాత్కాలిక భవనాల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. నాటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలితంగా ప్రస్తుతం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేడ్చల్ మల్కాజిగిరి, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అలంపూర్, మక్తల్, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సాపూర్, హుస్నాబాద్, డోర్నకల్, కల్వకుర్తి, పినపాక, బాల్కొండ, ధర్మపురి, నందిపేటలో కొత్తగా ఫైర్స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటికి రూ.57.04 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న చెన్నూర్, నిజామాబాద్‌రూరల్, పాలకుర్తి, జయశంకర్ భూపాలపల్లి, వైరా, దేవరకద్ర, కొడంగల్, ఆలేరు, ఖానాపూర్, మోత్కూర్, జడ్చర్లలో అగ్నిమాపకశాఖ భవనాలను పునర్మించనున్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ ఫైర్ హెడ్‌క్వార్టర్స్, కంట్రోల్ రూమ్‌లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. చేవెళ్ల ఫైర్‌స్టేషన్ పెండింగ్ పనులను పూర్తి చేయనున్నారు. ఈ మొత్తం నిర్మాణాలకు సుమారు రూ.28.52 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్నిమాపకశాఖకు ఏటా బడ్జెట్లో రూ.1-3 కోట్లలోపే కేటాయించేవారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అగ్నిమాపకశాఖ ఔన్నత్యాన్ని, అవసరాన్ని గుర్తించింది. పదేండ్లలో రూ.100 కోట్ల వరకు కేటాయించింది. ఫలితంగా 2023 ముగింపునాటికి 9.67 శాతం అగ్ని ప్రమాదాలు తగ్గాయి. ఒక్క ఏడాదిలోనే 2,093 మంది ప్రాణాలను రక్షించారు. రూ.918 కోట్ల ఆస్తిని అగ్నిమాపకశాఖ కాపాడింది. నాటి సీఎం కేసీఆర్.. కొత్తగా 50 మంది సిబ్బందితో ఎస్టీఆర్ఎఫ్ ఏర్పాటు చేయించి.. అగ్నిమాపకశాఖను పటిష్టమైన రక్షణ వ్యవస్థగా తీర్చిదిద్దారు.