బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 6: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో విషాదం చోటుచేసుకున్నది. శివ అనే 21 ఏండ్ల యువకుడు పాముతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సరదాకు వీడియో తీసుకునే ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలు పోగోట్టుకోవాల్సి వచ్చింది. దేశాయిపేట్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్దకు నాగుపాము వచ్చిందని గురువారం సాయంత్రం స్థానికులు సమాచారమిచ్చారు. అక్కడే నివసిస్తున్న శివరాజు హుటాహుటిన అక్కడకు చేరుకుని దాన్ని పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా పడగ విప్పిన పాము తలను నోట్లో పెట్టి బంధించాడు.
నిమిషంపాటు ఊపిరి తీసుకోకుండా నాగుపామును నోట్లో పెట్టుకొని వీడియో చిత్రీకరించాడు. పక్కకున్న యువకులు కేరింతలు కొట్టడంతో సరదాగా భావించాడు. కొద్దిసేపటి తర్వాత పామును బయటకు తీయగా, అప్పటికే పాము నీరసించి కిందపడి పోయింది. శివరాజు అక్కడి నుంచి చెట్టుకిందకు వెళ్లి కూర్చోగా, కాసేపటికే కండ్లు తిరిగి పడిపోయాడు. ఆందోళన చెందిన స్థానికులు పాము కాటుకు గురయ్యాడని గుర్తించి, బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.