పెద్దపల్లి, మార్చి 15(నమస్తే తెలంగాణ): గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 17నుంచి 22 వరకు గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్టు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వెల్లడించారు. శనివారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి పాదయాత్రగా వెళ్లి గోదారమ్మ కన్నీటి కష్టాలను కేసీఆర్ వివరిస్తామన్నారు. గోదావరి అడుగంటడంతో తీర ప్రాంతమంతా ఎడారిగా మారి ఇసుక మేటలు వేశాయని, కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ మీద అక్కసుతో తెలంగాణను ఎండ బెడుతున్న కాంగ్రెస్ దుర్మార్గమైన పాలనను ఎండ గడుతూ మహా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.