హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితులపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు 18 మందిపై లుక్ అవుట్ సర్కిల్(ఎల్వోసీ)జారీచేశారు. మిగతా నిందితుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వివిధ రాష్ర్టాల్లో సీసీఎస్ సైబర్‌క్రైమ్ బృందాలు అరెస్ట్ చేస్తున్న వారిలో ఎక్కువగా బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలను సేకరించేవారే ఉంటున్నారు. ఖాతాదారులు, ఖాతాదారుల నుంచి డబ్బు సేకరించి ఏజెంట్లు ఆపై ఉండే వాళ్లకు క్రిప్టో కరెన్సీలో డబ్బు పంపిస్తున్నారు. అది వివిధ కరెన్సీల్లోకి మారి ప్రధాన నిందితులకు చేరుతున్నది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న సైబర్ నేరగాళ్ల పాస్‌పోర్టు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత నేరస్థుల డాటాను సేకరించి ఎక్కడున్నారని తెలుసుకొనే పనిలో ఉన్నారు. గతంలో సైబర్ నేరగాళ్ల కోసం ఎల్వోసీ జారీ చేస్తే నేపాల్‌లోని ఖట్మాండ్ మీదుగా రోడ్డుమార్గంలో భారత్‌లోకి ప్రవేశిస్తుండగా, పోలీసులు పట్టుకొని సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు.
నకిలీ బ్యాంక్ అధికారుల అరెస్టు
నీలగిరి, అక్టోబర్ 7: తాము బ్యాంకు అధికారులమని చెప్పుకుంటూ.. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం నల్లగొండలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీ లింగోటానికి చెందిన షేక్ వజీర్, వెలుగుగూడేనికి చెందిన కట్టెబోయిన పరమేశ్, వెంకటాద్రిపాలేనికి చెందిన మమ్ముల జ్యోతిస్వరూప్, చిరుమర్తికి చెందిన కొండా శ్రీను, మిర్యాలగూడకు చెందిన గోగుల సురేశ్, జప్తివీరప్పగూడేనికి చెందిన చిలుముల సైదులు, తెప్పలమడుగుకు చెందిన పల్లెబోయిన నాగరాజు, నార్కట్‌పల్లికి చెందిన ముప్పిడి సైదులుతో కలిసి టీమ్‌గా ఏర్పడి 28 మంది నుంచి సుమారు రూ.26 లక్షల వరకు వసూలు చేసినట్టు ఎస్పీ తెలిపారు.