హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇవాళ దేశంలో అన్నపూర్ణ ఎవరంటే ముందుగా చెప్పుకొనే పేరు తెలంగాణ. ప్రపంచాన్ని కరోనా కాటేసి రెండున్నరేండ్లయింది. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. దేశమంతటా వ్యవసాయమూ కుదేలైన పరిస్థితి. ఈ దశలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులనుంచి చివరి గింజవరకు ధాన్యం కొన్న రాష్ట్రం తెలంగాణే. మహమ్మారి ముప్పిరిగొన్నప్పటినుంచి ఇప్పటివరకు నిరాఘాటంగా రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నది తెలంగాణే. కరోనా కష్టానికి రాష్ట్రంలోని ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి చాలాకాలం ముందుగానే తెలంగాణ పేదలను కడుపులో పెట్టుకొని కాచుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. 2020 ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్
కార్డులున్న కుటుంబాలకు ఉచితంగా మొదలు పెట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగిస్తున్నది. ఇందుకోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. మొత్తం 37 లక్షల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. ఇప్పటికే 15 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేసింది. ఈ నవంబర్ వరకు మరో 3 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నది.
అందరి ఆకలి తీరేలా..
ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం రాష్ట్రంలోని పేదలకే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడ బతికేందుకు వచ్చిన వలస కార్మికుల ఆకలిని కూడా తీర్చారు. వీరందరికీ ఒక నెల 12 కేజీల ఉచిత బియ్యంతోపాటు రూ.500 నగదు ఇచ్చారు. అంతేకాదు.. ప్రైవేట్ టీచర్లకు మూడు నెలల పాటు రూ.52.26 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి 25 కేజీల సన్నబియ్యాన్ని అందించారు. వీటన్నింటికీ మించి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1500 చొప్పున 2 నెలలు ఆర్థిక సాయం చేశారు. ఇందుకోసం రూ.2454 కోట్లు ఖర్చుచేశారు.
రాష్ట్రంలో పేదలను గుర్తించని కేంద్రం
మరోవైపు రాష్ట్రంలోని పేదల్ని గుర్తించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మనసు రావటంలేదు. రాష్ట్రంలో మొత్తం 90.50 లక్షల కార్డులు ఉన్నాయి. ఇందులో కేంద్రం గుర్తించి రేషన్ అందిస్తున్న కుటుంబాల సంఖ్య 53.56 లక్షలు మాత్ర మే. మిగతా 37 లక్షల కుటుంబాల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ఈ 37 లక్షల కార్డులకు సంబంధించిన దాదా పు 90.63 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నది. ఇటీవలే తాజాగా మరో 3.09 లక్షల కొత్త కార్డులను రాష్ట్రం మంజూరు చేసింది. దీనివల్ల మరో 8.65 లక్షల మంది పేదలకు ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం ఇంతగా కృషి చేస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం చాన్స్ దొరికితే చాలు అన్నట్టుగా నిందలు వేయడానికి కాచుక్కూర్చున్నది. గత మే నెలలో సాంకేతిక కారణాల వల్ల బియ్యం పంపిణీ జరుగలేదు. దీంతో అసలు పూర్తిగా పంపిణీయే చేయడం లేదంటూ ఆరోపణలు చేయడం చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకొంటున్నారు.
పేదలు ఆకలితో ఉండొద్దన్నదే సీఎం లక్ష్యం
ఏ ఒక్క పేద కూడా ఆకలితో ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే ఆర్థికంగా భారమైనా, పేదలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఉచిత బియ్యం పంపిణీకి నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రం రూ.4వేల కోట్లను ఖర్చు చేస్తున్నది. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. మా ప్రభుత్వం పేదలకోసం ఇంత చేస్తున్నా.. కేంద్రం మాత్రం రాజకీయ కక్ష సాధింపు కోసం నిందలు వేస్తున్నది.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి