హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ నూతన ఎండీ వై నాగిరెడ్డిని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, ప్రతినిధులు వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలు, కార్మిక సంఘాల ఎన్నికలు, సంఘాల పునరుద్ధరణ, కార్మికులపై పనిభారం, సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇటీవల ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాగిరెడ్డికి యూనియన్ ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12న రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలో పోలియో చివరి కేసు 2007లో, దేశంలో 2011లో నమోదైనట్టు తెలిపింది. గత మూడేండ్లుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాల్లో కేసులు నమోదు కావడం, ఆయా దేశాల నుంచి మనదేశానికి రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో రాష్ట్రంంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాలతో పాటు వరంగల్ పట్టణ ప్రాంతంలోనూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది. ఈ జిల్లాల పరిధిలో ఐదేళ్లలోపు వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అంచనా వేసిన అధికారులు పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.