Municipalities | తెలంగాణ రాకముందు మన పల్లెలే కాదు పట్టణాలూ విపరీతంగా వివక్షకు గురయ్యాయి. నిధులు లేక, అభివృద్ధి జరగక మురికి కూపాలుగా తయారయ్యాయి. పట్టణాల ప్రగతిని పట్టించుకున్న పాపాన పోలేదు నాటి కాంగ్రెస్ పాలకులు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకూ ప్రయత్నించలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణాల దశ, దిశ మారింది. నగరాలకు దీటుగా మన పట్టణాలు అభివృద్ధి చెందాయి. మాడల్ పట్టణాలుగా మారుతున్నాయి. పట్టణాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ‘3ఎం’ ఫార్ములాను అవలంబిస్తున్నది. అదే.. మనీ, మ్యాన్‌పవర్, మెటీరియల్. పట్టణాలకు లోటు లేకుండా నిధులను, కొరత లేకుండా సిబ్బందిని కేటాయిస్తున్నది. ఫలితంగా నేడు మన పట్టణాలు అనేక అవార్డులు అందుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో మనది మూడో స్థానం. తెలంగాణ జనాభాలో 47 శాతం పట్టణాల్లో నివసిస్తున్నది. మరో ఐదేండ్లలో గ్రామీణ జనాభా కంటే పట్టణ జనాభా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టుగా పట్టణాలను అభివృద్ధి చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ దిశగా ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, జవాబుదారీతనం తీసుకరావడంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయి మన పట్టణాలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ఆలోచనలకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం మన పట్టణాల రూపురేఖలనే మార్చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 2020 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబర్ వరకు రూ.5,176 కోట్లను ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పట్టణాభివృద్ధికి ఖర్చు చేసిన రాష్ట్రం మనదే.
క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీలో ఒక్కో డివిజన్‌కు మూడు వరకు, ఇతర కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్‌కు రెండు చొప్పున, చిన్న మున్సిపాలిటీలల్లో వార్డుకు ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణాలు ఏర్పాటవుతున్నాయి. 1,916 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించారు. ఇప్పటికే 1,273 క్రీడా ప్రాంగణాలు, 368 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు.
ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ విధానాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్నది. ఇందుకోసం 141 పట్టణాల్లో 2,165 కొత్త వాహనాలను కొనుగోలు చేసింది. దీంతో ప్రతిరోజు 4,356 టన్నుల చెత్తను సేకరించే సామర్థ్యం ఇప్పుడు కలిగింది. ప్రజలకు 37.19లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
మున్సిపాలిటీల అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చింది. పెద్ద గ్రామాలు, నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది. ఒకేసారి 74 కొత్త మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను ఏర్పాటు చేసింది.
మున్సిపాలిటీల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో అధికారి ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం వార్డు ఆఫీసర్ వ్యవస్థను తీసుకు వచ్చింది. ఇందుకోసం కొత్తగా మున్సిపల్ శాఖకు 3,712 పోస్టులను కేటాయించింది. 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ప్రతి వార్డుకో ఆఫీసరు ఉండనున్నారు. 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసరు పోస్టును మంజూరు చేశారు.
మానవ వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో పోయకుండా ప్రతి పట్టణంలో మానవ వ్యర్థాల ప్రాసెసింగ్‌కు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎఫ్ఎస్టీపీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. రూ.428.06 కోట్ల అంచనా వ్యయంతో 139 ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నది. వీటిలో ఇప్పటికే 28 పూర్తి అయ్యాయి.
రాష్ట్రంలోని పట్టణ జనాభాలో ప్రతి వేయి మందికి కనీసం ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండేలా 4,118 పబ్లిక్ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది. వీటి శుభ్రత, నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ సిస్టం(పీపీ టీఎంఎస్) యాప్ ఇతర రాష్ర్టాలను కూడా ఆకర్షించింది. దీనిని కేంద్రం కూడా అభినందించింది.
ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం అర్బన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 61 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటింటికీ నల్లా నీటిని అందించే పనులను చేపట్టింది. ఓఆర్ఆర్ పరిధిలోని 26 పట్టణ స్థానిక సంస్థల్లో జలమండలి నిర్మాణాన్ని చేపట్టింది. మరో 54 మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేశారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉండాలనే లక్ష్యంతో ఒక్క రూపాయికే 1.50లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 100 రూపాయలకు కనెక్షన్ ద్వారా 50 వేల ఇండ్లకు కనెక్షన్ ఇచ్చారు. 35.51లక్షల మందికి ఉచితంగా కనెక్షన్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ.6 వేల కోట్లు వెచ్చించి 44.88లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చింది.
మనిషి చనిపోయాక కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగే విధంగా అన్ని పట్టణాల్లో హైదరాబాద్‌లోని మహాప్రస్థానం తరహాలో వైకుంఠధామాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఒక్కో వైకుంఠధామాన్ని కోటి నుంచి రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ప్రతి వైకుంఠధామంలో ప్రహరీ, బర్నింగ్ యూనిట్లు, పూజా మండపం, దింపుడు గల్లం ప్రాంతం, మూత్రశాలలు, బూడిద నిల్వ, కట్టెలు నిల్వ ఉంచే రూం, పార్కింగ్ ఏరియా, అంతర్గత రహదారులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. 317 వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యింది. 176 పరమపద వాహనాలను సైతం కొనుగోలు చేశారు.
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడు వార్డులకు ఒక నర్సరీ చొప్పున 1,612 నర్సరీలను, 2,818 ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో మొత్తం 1,145 లక్షల మొక్కలను నాటారు. 23,607 కి.మీ రోడ్ల పరిధిలో 19,866 కిలోమీటర్లలో మొక్కలను నాటారు. 1,209 కిలోమీటర్ల పరిధిలో మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 36 లక్షల 28 వేల మొక్కలు నాటారు. మూడేండ్లుగా ప్రభుత్వం రూ.778 కోట్లను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించింది.
పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పూలు అన్నీ ఒకే దగ్గర లభించే విధంగా పట్టణాల్లో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. 25 వేల కంటే తక్కువ జనాభా ఉన్న 57 పట్టణాల్లో ఒక్కో దాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 81 పట్టణాల్లో ఒక్కొక్కటి రూ.4.50కోట్లతో నిర్మించనున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టణాలకు వివిధ పథకాల ద్వారా రూ.16,780 కోట్లను విడుదల చేసింది. పట్టణ ప్రగతి ద్వారా రూ.5,176 కోట్లను మంజూరు చేసింది. వీటికి తోడుగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దీంతో పట్టణ స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా పనులు సాఫీగా సాగిపోతున్నాయి. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
దేశంలోనే తొలిసారిగా ప్రతి మున్సిపాలిటికి ఒక ఆధునిక ధోబీఘాట్‌ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్‌కు రూ.2 కోట్ల చొప్పున రూ.282 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, అలంపూర్‌లో ఆధునిక ధోబీఘాట్లను ఏర్పాటు చేశారు.
వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి వసతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 618 స్ట్రీట్ వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేయాలని గుర్తించారు. వీటిలో 2,676 షెడ్డులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 1,294 పూర్తి కాగా మరో 1,382 పనులు కొనసాగుతున్నాయి.
పట్టణాల్లోని బస్తీల్లో ఉంటున్న పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొదటి దశలో 95 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 193 దవాఖానలను మంజూరు చేశారు. ప్రభుత్వం ప్రతి దవాఖానకు రూ.13.20 లక్షలు, నిర్వహణ ఖర్చు కోసం ప్రతి నెలా రూ.95,972ను వెచ్చిస్తున్నది.
పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సులభంగా అనుమతులు ఇచ్చేలా టీఎస్‌బీపాస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో అప్లయ్ చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు వస్తాయి. 75 గజాల స్థలం ఉన్న వారికి ఎలాంటి అనుమతి అక్కర్లేదు. కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది.
కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిది పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. యాదాద్రి కోసం వైటీడీఏ, వేములవాడ కోసం వీటీడీఏ, శాతవాహన పేరుతో కరీంనగర్‌కు సుడా, నిజామాబాద్‌కు నుడా, ఖమ్మంకు స్తంభాద్రి, సిద్దిపేటకు సుడా, నల్గొండకు నీలగిరి, మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు.
అవార్డులను సాధించడంలో దేశంలోనే తెలంగాణ ముందు నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్‌లో అత్యధిక అవార్డులను దక్కించుకొని దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని 19 పట్టణాలకు అవార్డులు రాగా, తెలంగాణకు 26 అవార్డులు వచ్చాయి. అవార్డులు సాధించిన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రాకముందు మన పట్టణాలు
ఎటు చూసినా మురుగు కాలువలు. ఖాళీ స్థలాలన్నీ చెత్తకుప్పలు. రోడ్లన్నీ గుంతలు. పని చేయని వీధి దీపాలు. గల్లీల్లో పందుల గోల. సాయంత్రం అయ్యిందంటే దోమల బాధ. వారానికోసారి మంచినీళ్ల ట్యాంకర్. రెండు బిందెల నీళ్ల కోసం కొట్లాటలు.
కేసీఆర్ ప్రభుత్వం మార్చిన మన పట్టణాలు
పరిశుభ్రమైన వీధులు. వాహనాలతో చెత్త సేకరణ. ఇంటింటికీ మంచినీటి సరఫరా. ఆహ్లాదకరమైన పార్కులు. అందంగా రోడ్లు. సుందరమైన జంక్షన్లు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ట్రీ పార్కులు. ఓపెన్ జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, మినీ స్టేడియంలు.