Musi Project | ఎల్బీనగర్, అక్టోబర్ 4: ఒక పూట తిని.. రెండు పూటలు పస్తులుండి పైసా పైసా కూటబెట్టుకున్నం.. సొంతిల్లు ఉండాలని కాయకష్టం చేసినం.. ఇంటి కలను నిజం చేసుకునేందుకు స్థలాలు కొని ఇండ్లు కట్టుకున్నం.. సర్కారీ ఆఫీసుల చుట్టూ తిరిగి అన్ని అనుమతులు తీసుకున్నం.. అలాంటిది ఇప్పుడొచ్చి ఇంటిని కూల్చివేస్తామంటే ఎలా? అది ప్రభుత్వ స్థలం అని, తామంతా కబ్జాదారులం అని అంటే ఎలా? అని మూసీ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మమల్ని భూకబ్జాదారులు అంటున్నారు. మేం భూకబ్జాదారులం కాదు. ఈ స్థలాలను కొనుకున్న యజమానులం. మా స్థలాల రక్షణ కోసం పోరాటం చేస్తున్నాం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. దశాబ్దాల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఆ జాగా తమది కాదని అధికారులు చెప్తుంటే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదని వాపోతున్నారు. ‘ఇదంతా పట్టా స్థలమని గ్రామపంచాయితీ అనుమతులతో లే అవుట్లు ఏర్పాటు చేశాకే కొనుగోలు చేశాం. అన్ని అనుమతులతో ఇండ్లను కట్టుకున్నాం. పట్టా స్థలాల్లో నిర్మించిన ఇండ్ల జోలికి రాకుండా మూసీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. మూసీ ప్రాజెక్ట్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలి’ అని ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహకంలోని చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని కాలనీలు, బస్తీల ప్రజలు కోరుతున్నారు.
హైకోర్టు నుంచి స్టేలు
అన్ని అనుమతులతో నిర్మించిన తమ ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వ అధికారులు రావడంపై చైతన్యపురి ఫణిగిరికాలనీ శ్రీ వెంకటసాయినగర్ కాలనీ వాసులు సుమారు 17 మంది హైకోర్టు నుండి స్టేలు తీసుకున్నారు. తాము అన్ని అనుమతులతో ఇండ్లను నిర్మించుకుంటే ఇలా మూసీ ప్రాజెక్ట్ పేరుతో తమ నివాసాలను కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫణిగిరికాలనీకి చెందిన మరో 16 మంది కూడా హైకోర్టును ఆశ్రయించారు.
అనుమతులు ఉన్న ఇండ్లను వదిలేయాలి
ముందు మూసీ ప్రాజెక్ట్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలి. అన్ని అనుమతులతో నిర్మించిన నివాసాలను వదిలి మూసీ ప్రాజెక్ట్‌ను చేపట్టాలి. పట్టా స్థలాలు వదిలి మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. మూసీ లోయర్‌లో ఉన్న వారికి కూడా తహసీల్దార్ కన్వీన్స్ డీడ్ ఇచ్చారు. 1978లో గ్రామపంచాయితీ లే అవుట్‌తో ప్లాట్లు కొన్నాం.
– నర్సింహప్రసాద్, వెంకటసాయి నగర్, చైతన్యపురి
అప్పు చేసి జాగా కొనుక్కున్నాం
ఎంతో శ్రమించి, కష్టపడి సంపాదించి కూడబెట్టిన డబ్బులు, కొంత అప్పు చేసి ఇటీవలే ఫణిగిరి కాలనీలో 160 గజాల స్థలాన్ని రూ.40 లక్షలకు కొనుగోలు చేశాను. ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నాను. అంతలోనే పిడుగుపాటు వార్త వినిపించింది. ఈ స్థలం రివర్‌బెడ్‌లో ఉన్నదంటూ మార్కింగ్ చేశారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– గొల్లపూడి వేణుగోపాల్, ఫణిగిరి కాలనీ
25 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నా
కార్పెంటర్‌గా కాయాకష్టం చేసి సంపాదించిన డబ్బుతో 25 ఏండ్ల క్రితం 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. ఇప్పుడు మూసీ అభివృద్ధి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మా ఇండ్లను కూల్చేందుకు సిద్ధం అవుతున్నాడు. మూసీకి 100 మీటర్ల దూరంలో ఉన్నా మా ఇంటికి రివర్బెడ్ అంటూ మార్కింగ్ చేశారు. మా కుటుంబ పరిస్థితి ఏమిటి? మూసీ అభివృద్ధి చేయాలి కానీ కానీ పేదల ఇండ్లను కూల్చొద్దు.
– వీరాచారి, ఫణిగిరి కాలనీ