హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచీ పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతూనే ఉన్నది. తొలి రోజు నుంచి శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ దాకా అధికారుల తీరు వివాదాస్పదంగానే కనిపిస్తున్నది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ బాధితుల్లో అన్ని వర్గాల నుంచి భారీగా నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చారు. గతంలో ఎన్నడూలేని విధంగా సబ్బండ వర్ణాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసినట్టుగా నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వాతావరణం కనిపించింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కావడంతో వ్యతిరేకత బయటికి కనిపించకుండా ప్రభుత్వ పెద్దలు పావులు కదిపినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్,ఫార్మా రైతులకు రెవెన్యూ అధికారులు ఎలక్టోరల్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు.
తీరా ఆ కాపీలను తీసుకొని నామినేషన్లు వేసేందుకు వచ్చినా చిన్నచిన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపి పెద్దఎత్తున నామినేషన్లను స్వీకరించకుండా తిరస్కరించారు. దీంతో ఉప ఎన్నిక బరిలో దాదాపు 200 మందికిపైగా అభ్యర్థులు ఉండాల్సిందిపోయి చివరికి ఆ సంఖ్యను 81కి కుదించడంలో అధికారులు కీలక పాత్ర పోషించారని నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక పరిశీలనలోనూ అదేరీతిన వ్యవహరించగా ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణలోనూ అవే కుట్రలకు తెర తీసినట్టు చెప్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 2.30 గంటల వరకు కేవలం ఆరుగురే నామినేషన్లను ఉపసంహరించుకుంటే.. చివరి అర గంటలోనే 17 మంది ఉపసంహరించుకోవడం కుట్రల అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.
తొలి రోజు నుంచీ అవాంతరాలే
కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలను నామినేషన్లు వేయనీయకుండా తొలిరోజు నుంచీ అడ్డంకులు సృష్టించారు. ఫార్మాసిటీ బాధిత రైతులకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎలక్టోరల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేయకుండా మూడు రోజులు తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. చివరికి ‘నమస్తే తెలంగాణ’ జోక్యం చేసుకోవడంతో దిగొచ్చిన అధికారులు సర్టిఫికెట్లు జారీ చేశారు. అటు నామినేషన్ దాఖలు చేసే తొలిరోజైన మంగళవారం కూడా చిన్నచిన్న కారణాలు చూపి నామినేషన్లు తీసుకోకుండా వెనక్కి పంపారు. ఒక్కరోజే 188 టోకెన్లు జారీ చేసి తెల్లవారుజామున 2 గంటల దాకా అభ్యర్థులను ఇబ్బంది పెట్టారు. అందులోనూ పూర్తిగా కోత విధించి ఫైనల్గా 211 నామినేషన్లు దాఖలైనట్టు ప్రకటించారు. అంత మొత్తంలో ఉండటంతో అధికార కాంగ్రెస్ నుంచి ఒత్తిడి పెరిగిందో? ఏమో? గాని స్క్రూటినీ పేరిట 81కి కుదించారు. ఇప్పుడు ఏకంగా ఉప సంహరణలోనూ అధికారుల పేరిట అభ్యర్థులను ఆర్వో కార్యాలయానికి పిలిపించి విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో సంఖ్య కాస్తా 58కి చేరింది. నామినేషన్ వేసేందుకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం నుంచి మొదలు నామినేషన్ల స్వీకరణ దాకా ప్రతిదానిలో కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ చరిత్రలోనే పెద్ద ఎత్తున నామినేషన్లు కావడంతో అధికార కాంగ్రెస్కు నష్టం కలుగుతుందని.. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వడపోతకు శ్రీకారం చుట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి నామినేషన్ల ఉప సంహరణలోనూ అధికారులు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకు శతవిధాలుగా ప్రయత్నించారన్న వాదనలు వస్తున్నాయి.
గుర్తులు కేటాయించేటప్పుడు ఉండాల్సిందే
నామినేషన్లు వేసిన కాంగ్రెస్ బాధితులకు పత్రాల్లో ఫొటోలు సరిగ్గా లేవని అధికారుల పేరిట ఫోన్లు చేసినట్టు తెలుస్తున్నది. మరికొంత మందికి గుర్తులు కేటాయించేటప్పుడు అభ్యర్థి లేకుంటే తిరస్కరిస్తామని ఫోన్లు చేసి కార్యాలయానికి రావాలని సూచించినట్టు చెప్తున్నారు. అధికారులు ఫోన్లు చేసి రమ్మనడమేమిటని కొందరు అభ్యర్థులు ప్రశ్నించగా అక్కడికి వెళ్లిన మరికొంతమందిని ఉప సంహరించుకోవాలని బెదిరించినట్టు తెలుస్తున్నది. ఓ నిరుద్యోగ జేఏసీకి చెందిన అభ్యర్థికి ఆర్వో కార్యాలయంలోనే రూ.50 వేలిస్తామని, నామినేషన్ ఉప సంహరించుకోవాలని కోరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా చూస్తుంటే నామినేష్ల సంఖ్యను మరింత తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్టు తేటతెల్లమవుతున్నది. మొదటి నుంచీ కాంగ్రెస్ వ్యతిరేకులను పోటీ చేయకుండా ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
నామినేషన్లు స్వీకరించేటప్పుడు కాంగ్రెస్ బాధితుల నామినేషన్లు చెల్లుబాటు కావంటూ బయటకు పంపారు. ట్రిపుల్ఆర్, ఫార్మాసిటీ బాధిత రైతులు కాంగ్రెస్ విధానాలకు నిరసనగా ఆకుపచ్చకండువా కప్పుకొని నామినేషన్ వేసేందుకు వచ్చారు. వివిధ కుల సంఘాల నేతలు వారికి సంబంధించిన రంగుల కండువాలను కప్పుకొని వచ్చారు. అధికారులు అలా వచ్చిన వారి నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా స్వీకరించకుండా చెల్లుబాటుకావని చెప్పినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తిరస్కరణలోనూ కాంగ్రెస్ బాధితుల నామినేషన్ పత్రాల్లో కుంటి సాకులను చూపుతూ రిజెక్టు చేసినట్టు చెప్తున్నారు. ఎన్నికల అ ధికారుల తీరుకు నిరసనగా ఆర్వో కార్యాలయం ముందు ఆందోళన సైతం చేపట్టారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని ప్రకటించారు. అధికారులు కావాలనే కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడంలో భాగంగా తమ నామినేషన్లు తీసుకోలేదని మీడియా సాక్షిగా తేల్చిచెప్పారు. ఇప్పుడేమో ఉపసంహరించుకోడానికి ఫో న్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అర గంటలోనే 17 మంది ఉపసంహరణ ఎలా?
నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా శుక్రవారం 81 మందిలో 23 మంది వెనక్కి తీసుకున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా ఆరుగురు మాత్రమే తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు అధికారులు సమాచారమిచ్చారు. ఉపసంహరణకు గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండటంతో మరో అర గంటలోనే 17 మంది ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. అరగంటలోనే అంతమంది వెనక్కి తీసుకోవడం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి అభ్యర్థులకు ఫోన్లు చేసి దూరం నుంచి రప్పించడంతో చివరి అర గంటలోనే ఎక్కువ మంది వచ్చినట్టు కాంగ్రెస్ బాధితులు ఆరోపిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడంలో భాగంగానే అధికారులు వారికి ఫోన్లు చేసి ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే తమకు కూడా వివిధ పేర్లు, నంబర్లతో ఫోన్లు వచ్చాయని చెప్తున్నారు. నామినేషన్లు ఎంత తగ్గిస్తే కాంగ్రెస్ బాధితులను అంతవరకు అడ్డుకోవచ్చని ఇలా చేశారంటూ వివిధ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఆర్వో ఆఫీస్కు రావాలని ఒత్తిడి చేసిండ్రు
మాల సంఘాల నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులకు వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేసి ఆర్వో కార్యాలయానికి రావాలన్నరు. ఎందుకని ప్రశ్నిస్తే నామినేషన్ పత్రాల్లో ఫొటోలు సరిగ్గా లేవు.. సరి చేసుకోవడానికి రావాలని చెప్పిండ్రు. మేము రాము.. అప్పుడే అన్ని ఫొటోలు ఇచ్చినమని చెప్పినం. మరోసారి ఫోన్ చేసి గుర్తులు కేటాయించేటప్పుడు అభ్యర్థి కచ్చితంగా ఉండాలన్నరు. ఆర్వో కార్యాలయానికి రాకుంటే నామినేషన్ తిరస్కరణకు గురవుతదని బెదిరించిండ్రు. మాకు అన్ని నిబంధనలు తెలుసు, నిబంధనల ప్రకారం మాకు ఏ గుర్తు కేటాయించినా అభ్యంతరం లేదని చెప్పినం. అసలు ఎన్నికల అధికారులు ఫోన్ చేసి రమ్మనడం మునుపెన్నడూ చూడలే. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేశామన్న ఒక్క కారణంతోనే మమ్మల్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని అర్థమైంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ మోసాలను వివరించి ఆ పార్టీ అభ్యర్థిని ఓడగొడుతం.
-రాహుల్, మాల విద్యార్థి జేఏసీ చైర్మన్