హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. కామాంధులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారుల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేయకపోవడంతోనే నేరస్థులు రెచ్చిపోతున్నారని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ(వైఏసీ) సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ పోలీసుశాఖకు దరఖాస్తు చేయగా రాష్ట్రంలో 2020 నుంచి 2025 వరకు నమోదైన పోక్సో కేసుల వివరాలను అందజేశారు. ఆ వివరాలను వైఏసీ వ్యవస్థాపకుడు రాజేంద్ర శనివారం మీడియాకు వెల్లడించారు.
ఐదేండ్లలో 16,994 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసుల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020 నుంచి 2025 ఏప్రిల్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,994 పోక్సో కేసులు నమోదయ్యాయి. 15,634 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, 8979 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ 188 కేసులలో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 2,619 నమోదు కాగా, 2447 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇప్పటివరకు 42 కేసులలో మాత్రమే శిక్ష పడింది. ములుగు జిల్లాలో అతితక్కువగా 124 కేసులు నమోదవగా 95మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలోరెండు కేసులోనే నిందితులకు జైలు శిక్ష పడింది.
తప్పు చేసిన వారిని శిక్షించండి
సమాజంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వాటిని నిరోధించాలంటే తప్పు చేసిన వారికి సత్వర శిక్షలు పడాలి. అప్పుడే బాలికలు, మహిళల జోలికి వెళ్లాలంటేనే భయం ఉంటుంది. మరొకరికి తప్పు చేయాలనే ఆలోచనే రాదు. మన దగ్గర శిక్షలు పడినవారు చాలా తక్కువగా ఉన్నారు. పోక్సో కేసులు పెద్దసంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి. తక్షణమే విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులు, న్యాయస్థానంపై ఉంది.
– రాజేంద్ర పల్నాటి, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్