హైదరాబాద్, జనవరి17 (నమస్తే తెలంగాణ): ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకాన్ని చేపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దీనికి రూ.162.57 కోట్లు కేటాయించిందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 50 టీఎంసీలను వినియోగించుకునే లక్ష్యంతో గ్రావిటీ లింక్ స్కీమ్‌ను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పాలేరు రిజర్వాయర్ ఎగువభాగంలో 40 వేల ఎకరాల ఎన్ఎస్పీ ఆయకట్టుకు భరోసా లభిస్తుందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 ఆయకట్టు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం డీబీఎం 60 కింద 76,308 ఎకరాల ఆయకట్టు, మోతే ఎత్తిపోతల పథకం కింద 46,712 ఎకరాల ఆయకట్టుకు ఆదనపు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా ప్రభుత్వానికి రూ.120 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అయ్యే ఆసారమున్నదని తెలిపారు.