Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/ జీడిమెట్ల, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ప్రియుడి కోసం భర్తలను చంపిన దారుణాలు ఇంకా జనాల మెదళ్లలో మెదులుతుండగానే.. ఓ బాలిక తన ప్రేమకు అడ్డు పడుతున్నదని ఏకంగా తల్లినే హతమార్చింది. ప్రియుడు, అతడి సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మంటగలుస్తున్న మానవ సంబంధాలకు ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి గాజులరామారం, ఎన్ఎల్బీ నగర్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన అంజలి (39) జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనుమరాలు. ఆమె జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారం, ఎన్ఎల్బీ నగర్లో నివాసముంటూ తెలంగాణ సాంస్కృతిక విభాగంలో కళాకారిణిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఆమెకు రెండు పెండ్లిళ్లు కాగా ఇద్దరు భర్తలూ చనిపోయారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు పదో తరగతి చదువుతుండగా మరో కూతురు 8వ తరగతి చదువుతున్నది.
ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న కూతురికి 8 నెలల క్రితం బంధువైన నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పగిళ్ల శివ (19)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఈ నెల 19న శివ బాలికను కట్టంగూర్కు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న తల్లి అంజలి జీడిమెట్ల పోలీసులకు శివపై ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను, శివను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికపై శివ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని తల్లి పోలీసులను కోరింది. అయితే పోలీసులు ‘పదో తరగతిలో ప్రేమా.. గీమా ఏంటమ్మా?’ అని మందలించి పంపారు. దీంతో తల్లికూడా మందలించడంతో తన ప్రేమకు తల్లే అడ్డు పడుతున్నదని బాలిక కోపం పెంచుకున్నది. ప్రియుడు శివతో కలిసి తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. సోమవారం సాయంత్రం కట్టంగూర్ నుంచి శివ, అతడి మైనర్ సోదరుడు కలిసి గాజులరామారం వచ్చారు. అంజలి సోమవారం ఇంట్లో పూజ చేస్తుండగా వెనుక నుంచి ఆమె ముఖంపై బెడ్‌షీట్ కప్పి, ఆ తర్వాత చున్నీతో గొంతు నులిమారు. ఆ తర్వాత శివ, అతడి సోదరుడు కలిసి ఆమె తలపై బలమైన ఆయుధంతో కొట్టారు. తల్లి తలపై కూతురు సుత్తితో కొట్టింది. శివ సోదరుడు కత్తితో గొంతు కోసి దారుణానికి ఒడిగట్టారు.
‘ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకురమ్మన్నది పద వెళ్దామని చెప్పి గల్లీలోనే తిప్పింది. 20 నిమిషాల తర్వాత అక్క, నేను ఇంటికి వెళ్లేసరికి వంటగదిలో మా అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను నేను చూసుకుంటా, నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్స్‌ను ఎవరినైనా తీసుకురా.. గల్లీలో అంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు అన్నది. కానీ మా అమ్మ చనిపోలేదని తెలిసి మా అక్క శివకు మళ్లీ కాల్ చేసింది. ఇంకా చనిపోలేదు.. కాళ్లు, చేతులు అడిస్తున్నదని ఫోన్లో చెప్పింది. వెంటనే శివ, అతడి తమ్ముడు వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టిండ్రు. రక్తంలో పడి ఉన్న అమ్మ వద్దకు వెళ్లి చేతులు, కాళ్లు రుద్దిన. మా అక్క మాత్రం దగ్గరికి రాకుండా దూరంగా ఉండి ఆమె చనిపోయింది.. లేపి వెస్ట్ అని చెప్పింది’ అని వెక్కివెక్కి ఏడ్చింది.
‘మా చెల్లి అంజలి అందరితో మంచిగా ఉంటది. ఆమెకు ఇద్దరు ఆడబిడ్డలు. పెద్ద బిడ్డకు ప్రేమ పేరుతో శివ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైండు. చదువుకునే వయస్సులో ప్రేమ ఏందని అన్నందుకు తల్లిపై బిడ్డ కోపం పెంచుకున్నది. ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి శివతో కలిసి పారిపోయింది. మేం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినం. పోలీసులు ఇద్దరినీ పట్టుకొచ్చి మందలించి వదిలేసిండ్రు. శివపై కేసు పెట్టి స్టేషన్లో ఉంచాలని పోలీసులను కోరినా వినలేదు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగింది’ అంటూ మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు.
మైనర్‌ను తీసికెళ్లిన శివపై జీడిమెట్ల పోలీసులు కేసు పెట్టుకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోలీసులు కేసు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ పరిశీలించారు. బాలికతో పాటు శివ, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.