హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో గాయపడినవారికి సత్వర చికిత్స అందించేందుకు హెచ్ఎండీఏ అధీనంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అవుటర్ రింగు రోడ్డుపై అత్యాధునిక సౌకర్యాలతో ట్రా మాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో ఎంతో మందికి పునర్జన్మ లభిస్తున్నది. దీంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఈ నేపథ్యంలో ట్రామాకేర్ సెంటర్లపై వాహనదారుల్లో అవగాహన పెరిగేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అవుటర్‌పై ఏదైనా ప్రమాదం లేదా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు సంప్రదించాల్సిన అత్యవసర కేంద్రాల వివరాలను హెచ్ఎండీఏ ఆదివారం ట్వీట్ చేసింది. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.