హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్ (Mirchowk) అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతులు..
అగ్నిప్రమాదంలో మరణించినవారిని ఆరుషి జైన్ (17), షీతల్ జైన్ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్ (13), అభిషేక్ మోడీ (30), రాజేంద్ర కుమార్ (67), ఇరాజ్ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్ (36), వర్ష (35), రజని అగర్వాల్ (32), రిషభ్ (4), ప్రీతం అగర్వాల్ (1)గా గుర్తించారు.
ముఖ్యమంత్రి ఆరా..
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతన్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని సూచించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
దీంతో అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాద కారణాలపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 6.16 గంటల సమయంలో ఫైర్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని మంటలను ఆర్పేశారు. అగ్నిప్రమాదంలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది మరణించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.
అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు జరిగిందని చెప్పారు. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాద తీవ్రతను తగ్గించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపం తెలుపుతున్నది. ఘటనలో 17 మంది ఉన్నారని, ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా తెలియాల్సి ఉందని చెప్పారు.