ఖైరతాబాద్, జూలై 7: నిరుద్యోగులను వంచించి, బీసీలను మోసగించిన కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల 15న సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారాంయాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సెక్రటేరియట్ ముట్టడి పోస్టర్లను ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఏల్చల దత్తాత్రేయ, టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణతో కలిసి రాజారాంయాదవ్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీలను గుప్పించిందని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కులగణన చేపట్టకుండానే స్థానిక ఎన్నికలకు పోవాలన్న యోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మెగా డీఎస్సీని ప్రకటిస్తామని ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 నిష్పత్తి ప్రకారం అవకాశం కల్పిస్తామని స్వయంగా అప్పటి ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పట్టించుకోవడమే లేదని మండిపడ్డారు. వారిచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతుంటే విద్యార్థి, నిరుద్యోగులు, బీసీలపై దాడులు చేస్తూ అరెస్టులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోళ్లలో సీఎం బీజీగా ఉన్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
నిరుద్యోగ సమస్య, కులగణనపై కాంగ్రె స్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీ పదవుల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలకు స్థానిక సంస్థల్లోనైనా ప్రాతినిధ్యం కల్పించరా? అని ప్రశ్నించారు. సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు నిరుద్యోగులు, విద్యార్థులు, బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతారని హెచ్చరించారు. సమావేశంలో హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు, బీసీ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్, తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపల్లి రామకోటి, తెలంగాణ బీసీ విద్యార్థి, యువజన సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తిగౌడ్, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ నేత లింగం శాలివాహన, అంబేద్కర్ యువజన సంఘం జాతీయ నేత కొంగర నరహరి పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న ఎక్కడ?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాడ కనిపించడం లేదని రాజారాంయాదవ్ ధ్వజమెత్తారు. రెండు లక్షల ఉద్యోగాలు, 25 వేల మెగా డీఎస్సీ, గ్రూప్ 2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల రోడ్డెక్కి, జైళ్ల పాలవుతుంటే వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 15న నిర్వహించే సెక్రటేరియేట్ ముట్టడికి విద్యార్ధి, యువజన, బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.