Cabinet Meeting | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. సభలో ప్రవేశపెట్టాల్సిన మూడు ముఖ్య బిల్లులపై క్యాబినెట్ సభ్యులు సమగ్రంగా చర్చించారని సమాచారం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును క్యాబినెట్ ఆమోదించినట్టు తెలిసింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుపై (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) మంత్రివర్గం సమ్మతి తెలిపినట్టు సమాచారం. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వరర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్- 2026’ బిల్లును సైతం క్యాబినెట్ ఆమోదించిందని తెలిసింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వరర్లు, ప్లాట్ ఫారం బేస్డ్ వరర్లు ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వరర్స్ రిజిస్ట్రేషన్‌తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు.
తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. న్యాయవాదులపై దాడులను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఈ మంత్రివర్గం ఉపసంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను నియమించారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్అండ్టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లను ప్రభుత్వం ఎల్అండ్టీకి చెల్లించి ఫేజ్-1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వం తరఫున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వరింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. ఇందులోని అంశాలపై క్యాబినెట్ చర్చించింది. సామాజిక న్యాయం, అన్నివర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు సర్వే చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది.
విద్యారంగ సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని శాసన మండలిలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 317జీవోతో స్థానికత కోల్పోయి గురుకులాల్లో పనిచేస్తున్న 400 మంది బాధిత ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి జీవో 190 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 269 గురుకులాల్లో 70 పాఠశాలలకు ఇన్చార్జులు ఉన్నారని, వెంటనే రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని కోరారు. గురుకులాలకు 8 నెలల్లో ముగ్గురు సెక్రటరీలు మారడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగోన్నతులు లేకపోవడంతో ఎఫ్‌ఏసీలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మైనారిటీ గురుకులాల టైమ్‌టేబుల్ మార్చారని, మిగతా గురుకులాల్లోని టైమ్‌టేబుల్ కూడా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. ఏప్రిల్ 30 వరకు గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటుచేసి ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పిస్తామని, అన్ని గురుకులాల సమయాల్లోనూ మార్పులు చేస్తామని స్పష్టంచేశారు.