హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ఏరియాల్లోని జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన పంచాయతీరాజ్ ప్రధానకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ భద్రాచలానికి చెందిన సామాజిక కార్యకర్త జీ రాము, మరొకరు వేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ టీ మాధవీదేవి విచారించారు.ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్లో తనపై నమోదు చేసిన డ్రగ్స్ కేసును కొట్టేయాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసును కొట్టేయాలన్న వ్యాజ్యాన్ని జస్టిస్ ఈ తిరుమలాదేవి మంగళవారం విచారించారు. పోలీసులు చట్టవిరుద్ధంగా కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా పడింది.