కరీంనగర్ కోర్టుచౌరస్తా, మార్చి 31 : ఓ హత్యానేరంలో 15 మందికి జీవిత ఖైదుతోపాటు రూ.1,500 జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు బొజ్జ తిరుపతి (48) బొజ్జ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరి పరిధిలో రాజసముద్రం, అప్పనపల్లి చెరువులు ఉండగా చేపలు పట్టుకునేందుకు ఫిషరీస్ శాఖ నుంచి తిరుపతి అనుమతులు తీసుకున్నాడు.
దీంతో సభ్యత్వంలేని మ్యాకం వంశం వారు తిరుపతిపై కక్ష పెంచుకున్నారు. అప్పనపల్లి చెరువులో నీరు తగ్గుతుండడంతో చెరువు పకనున్న ప్రతాపరెడ్డి బావి నుంచి నీటిని చెరువులోకి వదలాలని అనుకున్నారు. 2019 ఏప్రిల్ 19న బొజ్జ తిరుపతి తన వంశీయులతో కలిసి ప్రతాపరెడ్డి బావి నుంచి పైపులైన్ వేసేందుకు వెళ్లారు. విషయం తెలిసిన మ్యాకల వంశానికి చెందిన ధర్మరాజు, రాము లు, పోచయ్య, కొమురయ్య, ఆంజనేయులు, వెంకటేశం, నవీన్, ప్రవీణ్, శ్రీనివాస్ (తండ్రి కొమురయ్య), శ్రీనివాస్ (తండ్రి రాము లు), సంపత్, లచ్చయ్య , సత్తయ్య, శ్రీనివాస్ (తండ్రి వెంకటేశం), వెంకటరాజంతోపాటు ఓ బాలుడు బావి వద్దకు వెళ్లి తిరుపతిపై దాడిచేసి హత్యచేశారు.
బొజ్జ సమత ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు 16 మందిపై హత్య కేసు నమోదుచేయగా.. అప్పటి సీఐ శశిధర్రెడ్డి దర్యా ప్తు జరిపారు. సీఎంఎస్ ఏఎస్ఐ సత్తయ్య, సీడీవో రాజేందర్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పీపీ మల్యాల ప్రతాప్ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి శివకుమార్ 15 మంది నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాల నేరస్తుడిపై ఉన్న కేసు జువెనైల్ కోర్టులో విచారణలో ఉంది.