హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ) : ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా రూ.20 కోట్లకుపైగా వెచ్చించి తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రిస్తుండగా, ఈ సారి అదనంగా రూ. 5 నుంచి 10 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్ -1, గ్రూప్ – 2, పోలీసు, టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల్లో అత్యధికులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఎంపిక చేసుకొంటారు. ఈ పుస్తకాలనే ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రామాణికంగా తీసుకొంటారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా పుస్తకాలను అందుబాటులో తీసుకురావాలని అధికారులు కృషిచేస్తున్నారు.
ముద్రించే పుస్తకాలు ఇవే..
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (పోటీ పరీక్షల ప్రత్యేకం), తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం, తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర అవతరణ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జనరల్ స్టడీస్ -1, సామాజిక నిర్మితి – వివాదాలు – విధానాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అభివృద్ధి సమస్యలు, పరివర్తన, భారతదేశ చరిత్ర – సంస్కృతి, భారత ప్రభుత్వం రాజకీయాలు, భారతదేశ ప్రాంతీయ భూగోళశాస్త్రం, పర్యావరణ అధ్యయనం, భారత రాజ్యాంగం, విపత్తు నిర్వహణ, ఆర్థికాభివృద్ధి – పర్యావరణం.