సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్,ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ల్యాబరేటరీ భవనం మొదటి అంతస్థులో ఈ ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను భద్రపరిచే చోట మంటలు చెలరేగడంతో పలు కేసుల్లో సేకరించిన భౌతిక ఆధారాలు పూర్తిగా అగ్నికి ఆహుతయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు షార్ట్‌సర్క్యూటే కారణమని ఫైర్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవనం అంతటా దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడింది. సుమారు రెండున్నరగంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపుచేశారు.
నాంపల్లి రెడ్‌హిల్స్ ప్రాంతంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు ఆనుకొని ఉన్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలోని మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో ఉదయం పది గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తు నుంచి పొగ రావడాన్ని గమనించిన ఆఫీస్ బాయ్ కృష్ణ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తొలుత అక్కడే ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్‌బాయ్ తమ వద్ద ఉన్న పరికరాలతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతనికి సాధ్యపడక అస్వస్థతకు గురయ్యారు. లోపల ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ప్లాస్టిక్ సామగ్రి కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగి, గది మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
ఉదయం 10.30 గంటలకు సమాచారం అందుకున్న అగ్ని మాప క శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని ఒక రోబో ఫైరింజన్, 5 ఫైరింజన్ల సహాయంతో రెండున్నర గంటల పాటు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకున్నారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లడం కూడా అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. ఈ ప్రమాదంలో ఆ ఫ్లోర్‌లోని 40కి పైగా కంప్యూటర్లు, ప్రింటర్స్, స్కానర్స్, ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలు అగ్నికి ఆహుతి అయినట్లు ఫైర్ సిబ్బంది చెప్పారు.
ఈ ల్యాబ్‌లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయని కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారని అధికారులు చెప్పారు. అయి తే ఈ ఘటనకు కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలోని ఎంసీబీ ప్యానల్ బోర్డు నుంచి మంట లు రావడమే ప్రాథమిక కారణంగా అంచనా వేస్తున్నామని, మరింత లోతుగా విచారణ జరిగితే కారణాలు తెలుస్తాయని ఫైర్ ఉన్నతాధికారులు చెప్పారు. నార్త్‌జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్ల్లి,అగ్ని మాపక డీఎఫ్‌వో శ్రీదాస్లు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ భవనం లో జరిగిన ప్రమాదంలో మంటలు మొదటి అంతస్తుకే పరిమితం చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్మెటీరియల్ ఉంది. మంటలు రెండో అంతస్తుకు వ్యాపించి ఉంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, ప్రమాద తీవ్రత అధికంగా ఉండేదని ఫైర్ అధికారులు చెప్పారు. మొదటి అంతస్తులో ఉన్న సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిబూడిదయ్యాయని వారు తెలిపారు రెండో అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్‌కి మంటలు వ్యాపించకపోవడంతో మంటలు త్వరగా అదుపులోకి తీసుకురాగలిగామని సిబ్బంది పేర్కొన్నారు. అగ్ని ప్రమాదఘటనపై ఎఫ్ఎస్ఎల్ అధికారి ఫిర్యాదుమేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డాక్యుమెంట్స్‌పై ఇంకా స్పష్టత రాలేదు..:డీసీపీ శిల్పవల్లి
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి , ఫైర్ అధికారులు స్పందించారు. ఘటనాస్థలంలో పరిస్థితిని పరిశీలించిన డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ మొత్తం ఈ ల్యాబ్‌నుంచే జరుగుతుందన్నారు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉంటాయని, ఈ ప్రమాదంలో ఏమి కాలిపోయాయో, అందులో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు.
ఉదయం పదిన్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని , మొదటి అంతస్తులో పొగరావడం గమనించిన ఆఫీస్‌బాయ్ కృష్ణ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కృష్ణ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడని ఈ ప్రయత్నంలో కొంత అస్వస్థతకు గురికావడంతో 108 ద్వారా అతనిని ఆసుపత్రికి పంపించామని శిల్పవల్లి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగే సమయానికి ఇంకా ఆఫీసు పూర్తిగా ఓపెన్ కాకపోవడంతో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ నలుగురు మొదటి అంతస్తులో మంటలు చెలరేగగానే అవి గమనించి సురక్షితంగా బయటికి వచ్చారని డీసీపీ చెప్పారు.
ఫైర్ డీఎఫ్‌వో శ్రీదాస్ మాట్లాడుతూ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ భవనంలోకి వెళ్లేందుకు అవకాశాలు సులభతరంగా లేకపోవడంతో పోర్టికో నుంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాతే లోపలికి వెళ్లగలిగామన్నారు. ఘటనాస్థలంలో దట్టమైన పొగ ఆవహించడంతో సహాయకచర్యలు కొంత కష్టమయ్యాయని, అయినప్పటికీ రెండున్నర గంటలలో పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చామని డీఎఫ్ఓ చెప్పారు. హార్డ్ డిస్క్‌లు పూర్తిగా కాలిపోయాయా లేక పాక్షికంగా కాలాయా అనేది పరిశీలించాల్సి ఉందని శ్రీరామ్‌దాస్ చెప్పారు. గదిలో పూర్తిగా ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు కూడా మంటలకు తోడవడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.