దుండిగల్, ఫిబ్రవరి 7: సాంకేతిక ఆవిష్కరణతో తమకు మరెవరూ సాటిలేరని ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు మరోసారి చాటిచెప్పారు. దుబాయ్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక గ్లోబల్ స్టార్టప్ ఈవెంట్లో తమ అద్భుతమైన ఐడియాతో అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. ఈ ఈవెంట్లో ఐఐఐసీఎస్ఈ విద్యార్థులు శివన్స్ ప్రషెర్, దాస శ్రీశాంత్ తమ స్టార్టప్‌ను ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, కంపెనీ వ్యవస్థాపకులు, పరిశ్రమ దిగ్గజాల ఎదుట ప్రదర్శించారు. వీరి ఆవిష్కరణలోని సాంకేతిక నైపుణ్యం, వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపేవిధానం అందరినీ ఆకట్టుకుంది.
దీంతో విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ కంపెనీల నుంచి వ్యూహత్మక భాగస్వామ్య ఆహ్వానాలు అందాయి. ముఖ్యంగా వీరి నాయకత్వ పటిమను గుర్తించి ఒక ప్రతిష్ఠాత్మక సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) హోదాను సైతం ఆఫర్ చేయడం విశేషం. విద్యార్థుల అంతర్జాతీయ పర్యటనకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని యాజమాన్యమే అందజేసింది. కాగా, ఇది వారి వ్యవస్థాపక సామర్థ్యంపై ప్రపంచస్థాయిలో నెలకొన్న నమ్మకానికి నిదర్శనమని కళాశాల యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. తమ కలలను నిజం చేయడంలో ఎంతో కృషి చేసిన కళాశాల యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కోశాధికారి మర్రి మమతారెడ్డి, డైరెక్టర్ మర్రి అను శ్రేయరెడ్డి, వైస్ చైర్మన్ మర్రి ధీరేన్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ రాధికాదేవి అభినందించారు.
కళాశాల కీర్తిని చాటడం హర్షనీయం ; మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి
అంతర్జాతీయ స్థాయిలో కళాశాల కీర్తిని చాటిచెప్పడం హర్షనీయమని మల్కాజిగిరి ఎమ్మెల్యే, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ విద్యాసంస్థలో విద్యార్థులకు చదువులు నేర్పించి వారికి పట్టాలు అందించడమే కాకుండా, వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.