హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : నదీ జలాల విషయంలో ఏపీని నిలువరించలేని ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సర్కార్ వినిపిస్తున్న మాట టెలిమెట్రీ. మరోవైపు ఇప్పుడు ఏపీ సమ్మితిస్తేనే టెలిమెట్రీల ఏర్పాటుపై ముందుకు పోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్డు (కేఆర్ఎంబీ) నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి నిరు డు ఏకంగా 250 టీఎంసీలకుపైగా మళ్లించుకుపోయిన ఏపీ, ఈ ఏడాది ఇప్పటికే 140 టీఎంసీలను మళ్లించుకుపోయింది.
నీటి వినియోగం, నిల్వ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టి ఏపీ సాగిస్తున్న జల దోపిడీని నిలువరించాల్సి ఉన్నది. ఇందుకోసం రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు పట్టుబడుతున్నామంటూ తెలంగాణ ప్రభు త్వం పదే పదే చెప్తున్నది. కానీ అడుగు ముందుకు పడటం లేదు. కృష్ణా జలాల వినియోగ లెక్కలను గణించేందుకు మొదటి విడతగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ కలుపుకుని మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను కేఆర్ఎంబీ గతంలోనే ఏర్పాటుచేసింది. అవి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. సీడబ్ల్యూపీఆర్ఎస్ సూచనల మేరకు టెలిమెట్రీల లొకేషన్ల మార్పుతోపాటు రెండో దశలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించి మిగతా తొమ్మిది ఔట్లెట్లపై టెలిమెట్రీలను ఏర్పాటుచేయాలని 2020లో నిర్వహించిన 14వ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. అందులో శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, నాగార్జునసాగర్ కుడి కాలువ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35 కిలోమీటర్ల వద్ద, నాగార్జునసాగర్ ఎడమ కాలువ 101.36 కిలోమీటర్ ఏపీ బార్డర్ వద్ద, పోలవరం కెనాల్, ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువ, ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువ, కర్నూలు కడప (కేసీ) కెనాల్ ఉన్నాయి. మొత్తంగా అందుకు రూ.7.18 కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారు. అయితే టెలిమెట్రీల ఏర్పాటుకు ఏపీ ముందుకు రాకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకే సాగడంలేదు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల్లో 1,010పైగా టీఎంసీలు ఈ ఏడాది వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నా తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ వచ్చింది. ప్రభుత్వ వైఫల్యం ఫలితంగానే గత నీటి సంవత్సరంలో 76 శాతానికిపైగా జలాలను ఏపీ కొల్లగొట్టింది. తెలంగాణ మాత్రం తన తాత్కాలిక వాటా 34% కన్నా తక్కువగా 24% జలాలను మాత్రమే వినియోగించుకున్నది. రాష్ట్రంలో నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడటం, వ్యతిరేకత వెల్లువెత్తడం, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిలదీయడంతో ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు టెలిమెట్రీలంటూ కాంగ్రెస్ సర్కార్ హడావుడి చేస్తున్నది. ఏపీ సర్కారు నిధులివ్వకున్నా తామే మొత్తం భరిస్తామంటూ తెలంగాణే 18వ బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు పెట్టింది. టెలిమెట్రీల ఏర్పాటుకు రూ.7.18 కోట్ల నిధులు అవసరమని బోర్డు లెక్కతేల్చింది. అందులో తెలంగాణ ప్రభుత్వం రూ.4.15 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికీ ఏడాది గడచినా బోర్డు టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టలేదు. ఇదిలా ఉండగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన భేటీలోనూ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి టెలిమెట్రీ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. వాటిపై చర్చ లేకున్నా, టెలిమెట్రీల విజయం సాధించామని, ఏపీని ఒప్పించామంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు.
టెలిమెట్రీల ఏర్పాటుకు సంబంధించి లొకేషన్లను అధ్యయనం చేసేందుకు కేఆర్ఎంబీ బృందం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించింది. బోర్డు అధికారులు టెండర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ పూర్తి చేశారు. బోర్డు చైర్మన్, మెంబర్ ఆమోదం పొందితే చాలు టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ బోర్డు చైర్మన్, మెంబర్ అందుకు ససేమిరా అంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆమోదం తెలిపినా కూడా టెలిమెట్రీల ఏర్పాటుకు సంబంధించి మళ్లీ ఏపీకి ప్రత్యేకంగా లేఖ రాసినట్టు తెలిసింది. నిధులను విడుదల చేయాలని ఏపీని సైతం బోర్డు కోరింది. నెలలు గడుస్తున్నా ఏపీ ఇప్పటికీ సమాధానమివ్వలేదు. దీనినే సాకుగా చూపుతూ ఏపీ సమ్మతిస్తేనే, నిధులను విడుదల చేస్తేనే టెలిమెట్రీల ఏర్పాటుకు ముందుకు పోవాలని బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.