హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బొంకరా పోలిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్టుగా ఉన్నది కేంద్ర సర్కారు తీరు. జనాల మెప్పు కోసం ఆకుకు అందకుండా పోకకు పొందకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నది. పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలులో కేంద్ర సర్కారు ఇదే రీతిన వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ గతంలోనే పీఎం శ్రీ స్కూల్స్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ, ఈ విద్యాసంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న వాటిలో 44 శాతం స్కూళ్లనే ఎంపిక చేసిం ది. మిగతా వాటికి మొండి చేయి చూపించింది. జాతీయంగా 6,448 స్కూళ్లను ఎంపికచేయగా, వాటిలో కేంద్రీయ విద్యాలయాలు 735, నవోదయ విద్యాలయాలు 317 ఉన్నాయి. మరో 5,396 మాత్రమే రాష్ర్టాలకు చెందిన పాఠశాలలున్నాయి.
మూడోస్థానంలో తెలంగాణ
బడులు ఎంపికైన రాష్ర్టాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ 928 స్కూళ్లతో అగ్రస్థానంలో, 662 స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో 542 స్కూళ్లతో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. వాస్తవానికి మండలానికి రెండు చొప్పున రాష్ట్రం నుంచి 1,204 స్కూళ్లు ఎంపిక కావాల్సి ఉన్నది. కానీ, కేంద్రం 542 స్కూళ్లను మాత్రమే ఎంపికచేసింది. ఈ ఏడాది ఈ పథకం కోసం రాష్ట్రం నుంచి 5,973 స్కూళ్లు పోటీపడితే, వాటిలో నుంచి 1,204 స్కూళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ స్కూళ్ల అభివృద్ధికి వచ్చే ఐదేండ్లలో రూ.27,360 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించనున్నాయి. కేంద్రం తన వాటాగా రూ.18,128 కోట్లను ఖర్చుచేయనున్నది. మిగతా మొత్తాన్ని రాష్ర్టాలు భరిస్తాయి. బడులను పూర్తిగా హరిత స్కూళ్లుగా అభివృద్ధి చేస్తారు.
పలు రాష్ర్టాల నుంచి ఎంపికైనవి
రాష్ట్రం ఎంపికైనవి
ఉత్తరప్రదేశ్ 928
ఆంధ్రప్రదేశ్ 662
తెలంగాణ 543
మహారాష్ట్ర 516
మధ్యప్రదేశ్ 416
రాజస్థాన్ 402
గుజరాత్ 274
పంజాబ్ 241
జమ్ముకశ్మీర్ 233