హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 14ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనునున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చేవారంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అర్హులైన సిబ్బంది అందరికీ బదిలీలు చేపడతామని ఆయన వెల్లడించారు. శుక్రవారం మంత్రి జూపల్లిని ఆయన నివాసంలో ఎక్సైజ్ అధికారులు కలిసి పలు సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. పదోన్నతుల అంశంతో బదిలీలు ముడిపెట్టడంతో బదిలీల ప్రక్రియ ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో దానిని వేగంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించి ఆమోదించామని పేర్కొన్నారు. విధి విధానాలను మరో నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని జూపల్లి వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.