అందాల పోటీలు.. పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కార్ ఊదరగొట్టింది. పాలన పక్కనబెట్టి మరీ.. సీఎం, మంత్రులు అందాల భామల చుట్టూ తిరిగారు. మిస్‌వరల్డ్ పోటీలతో రాష్ర్టానికి పైసా పెట్టుబడి రాలేదు. పైగా తనను వేధింపులకు గురిచేశారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువుపోయింది. దీనిపై ఇప్పటివరకు చర్యల్లేవు.
ఎస్ఎల్బీసీ.. తలాతోకా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మొన్న ఫిబ్రవరిలో కుప్పకూలింది. 8 మంది కార్మికులు సజీవసమాధి అయ్యారు. ఇంతవరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం వెలికితీయగలిగింది. టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యానికి, సహాయ కార్యక్రమాల్లో అలక్ష్యానికి సంబంధించి ఎవరిపైనా చర్యల్లేవు.
నో యాక్షన్.. నో కేస్!
సుంకిశాల.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి మరో ఉదాహరణ. కృష్ణా నది నీటి ఒత్తిడిని నిలువరించేందుకు నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిరుడు ఆగస్టులో కూలింది. ప్రాజెక్టు భవితవ్యాన్నే ప్రశ్నార్ధకం చేసిన ఈ ఘటనపై నేటికీ బాధ్యులపై చర్యల్లేవు.
ఫార్ములా-ఈ రేస్.. దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని, హైదరాబాద్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు చాటిచెప్పాయి. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. రూ.760 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఈ పోటీల్లో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్. అకౌంట్ నుంచి అకౌంట్‌కు బదిలీ అయిన డబ్బుల్లోనూ అక్రమాలు జరిగాయంటూ బురద చల్లుతున్నది. ప్రోసీజరల్ లోపమే తప్ప అవినీతి ఏమీ లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు. అయినా అవినీతి నిరోధకశాఖను విచారణకు దింపింది
KTR | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే.. అక్రమ కేసులు పెట్టించి పగ తీర్చుకుంటున్నారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి.. అనుభవలేమి కారణంగా వరస తప్పిదాలు చేస్తుంటే.. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు వాటిని ప్రశ్నలతో సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రశ్నలను కూడా ఓర్వలేకపోతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలను వరుస కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేవలం తన 18 నెలల పాలనలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏకంగా 15కు పైగా అక్రమ కేసులు పెట్టించారంటే ప్రతిపక్షం ప్రశ్నలకు ఆయన ఎంతలా భయపడుతున్నారో ఇట్టే అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు .
దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రపంచం మొత్తం గర్వించదగిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రపంచం మొత్తం సంబురంగా కొనియాడిన ఫార్ములా-ఈ రేస్‌లో లేని అవినీతిని అంటగట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదని అంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ముఖ్యనేతలను టార్గెట్ చేసుకున్న సీఎం.. ఏదో విధంగా వారిని ప్రజల్లో దోషులుగా నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు.
‘మాది ప్రజా పాలన.. ప్రజల వద్దకు పాలన’ అంటూ నిత్యం డాంబికాలకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్షం సంధించే ఒక్క ప్రశ్నను కూడా తట్టుకోలేకపోతున్నది. వాట్సాప్‌లో షేర్ చేసినా, ట్విటర్ (ఎక్స్)లో పోస్టు పెట్టినా.. ఫేస్బుక్లో కామెంట్లు చేసినా అక్రమ కేసులు పెడుతూనే ఉన్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ సర్కారు 18నెలల్లో 15కు పైగా అక్రమ కేసులు బనాయించింది. ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అని కేటీఆర్ అన్నందుకు సైఫాబాద్‌లో కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆఖరుకు ఎవరైనా హరీశ్‌రావు, కేటీఆర్ డీపీలు పెట్టుకొని పోస్టులు పెట్టినా కూడా కేటీఆర్, హరీశ్రావులపైనే కేసులు నమోదు చేయిస్తున్నది. ఇప్పటికే హరీశ్‌రావు వంటి పెద్ద నేతలపై కూడా 7 అక్రమ కేసులు పెట్టించారు. కిందిస్థాయి నేతలపైనా సీఎం రేవంత్‌రెడ్డి వరుస కేసులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై 28కి పైగా కేసులు, మన్నె క్రిశాంక్‌పై 15 కేసులు, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై 25 కేసులు పెట్టించారు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులపై ఎక్కడో ఒకచోట రోజుకో కేసు నమోదవుతూనే ఉన్నది.
మన దేశంలోనే తొలిసారిగా తెలంగాణకు ఫార్ములా-ఈ కార్ రేస్‌ను తీసుకొచ్చేందుకు నాడు మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేశ, విదేశాల్లో ఎఫ్ఐఏ నిర్వహకులను ఒప్పించి.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ములా-ఈ కార్ రేస్‌ను తెలంగాణలో నిర్వహించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిగట్టుకొని మరీ కేటీఆర్‌కు లేని అవినీతిని అంటగట్టి, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేసు నిర్వహణలో అవినీతి అంటూ కేవలం రాజకీయ కక్షతో, ఊహాజనితంగా ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై కేసు కూడా పెట్టించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు ఆఖరికి 18 నెలల్లో ఏమీ తేల్చలేకపోయారు. తన పదునైన ప్రశ్నాస్ర్తాలతో.. సీఎం రేవంత్‌రెడ్డి పంటికింద రాయిలా మారిన కేటీఆర్‌ను ఎలాగైనా జైలుకు పంపేందుకు ఈ కేసును ఆయుధంగా చేసుకొని, ఏసీబీ అధికారులతో విచారణ చేయిస్తున్నారు.
వాతావరణంలో ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో ఈ కార్లు నడుస్తాయి. జీరో కర్బన ఉద్గారాల విడుదల అనేది ఫార్ములా-ఈ రేసింగ్ ప్రత్యేకత. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో రేసింగ్‌లు నిర్వహించడం ద్వారా ఫార్ము లా-ఈ రేసింగ్‌కు మరింత ఆదరణ పెరిగింది. దీనికి తోడు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి మంచి తోడ్పాటు అందించేందుకు ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే, ఈ రేసులు నగరంలో నిర్వహించి అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచాలని నాటి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ తపనపడ్డారు. నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌తో కలిసి కసరత్తు చేసి, హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ వరుసగా ఐదుసార్లు మోస్ట్ లివెబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022ను గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొకలు నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్‌ను పెంచడం వంటివి ఎఫ్ఐఏ నిర్వాహకులకు చెప్పి ఒప్పించడంతో దేశంలోనే తొలిసారిగా నాడు ఫార్ములా-ఈ కార్ రేసు హైదరాబాద్‌కు వచ్చింది. ఈ రేస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో మొబైల్స్ (ఎఫ్ఐఏ) నిర్వహిస్తుంటుంది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించిన ఫార్ములా-ఈ రేసులో మొత్తం 11 జట్ల నుంచి 22 కార్లు బరిలోకి దిగాయి. ప్రఖ్యాత రేసింగ్ కంపెనీలుగా పేరొందిన మెక్లారెన్, మసారెటీ, పోశె, జాగ్వార్, నిస్సాన్, మహీంద్రా రేసింగ్ కార్లు పోటీపడ్డాయి. గంటకు 322 కి.మీ వేగంతో దూసుకుపోయే జెన్-3 ఎరా కారు రేసింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడంతో ప్రపంచవ్యాప్తంగా రేసింగ్ ప్రియులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపినట్టు ‘నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్’ తన అధ్యయనంలో వెల్లడించింది. ఫార్ములా- ఈ రేసు నిర్వహణతో నగర ఆర్థిక వ్యవస్థ రూ.700 కోట్ల మేర పుంజుకున్నదని, దేశంలో మరే ఇతర మెట్రో నగరానికి దకని ఘనతను హైదరాబాద్ సాధించిందని ఈ నివేదిక పేరొన్నది. కాగా, ఈ రేస్‌కు సంబంధించి 2024 ఫిబ్రవరిలో రేస్ నిర్వహించాల్సి ఉండగా.. సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నారు. దీంతో ఆ రేస్‌ను మరో చోటికి మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రేసు నుంచి వైదొలగడంతోనే ఆ కంపెనీకి కట్టిన డబ్బులు రాలేదు. అదే రేసు నిర్వహించి ఉంటే రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించడంతోపాటు తెలంగాణలో పర్యావరణహిత వాహన తయారీ పరిశ్రమలు కూడా వచ్చేవి. తెలంగాణకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరేది.
ఫార్ముల ఈ-రేస్ నిర్వహణలో ఎక్కడా అవినీతి జరగలేదు. కనీసం డబ్బులు చేతులు మారినట్టు, క్విడ్ ప్రో కో జరిగినట్టు ఒక్క ఆధారం కూడా పోలీసులు, ప్రభుత్వం వద్ద లేదు. ఎక్కడైనా ఉంటే ప్రొసీజర్‌లో లోపాలు మాత్రమే ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంలో ప్రొసీజర్ లోపాలు సాధారణం. ఈ రేస్ నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా-ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయి. అధికారికంగా, బ్యాంకు ద్వారానే నిధుల బదిలీ జరిగింది. ప్రభుత్వం పంపిన నిధులు తమకు చేరినట్టు కూడా నిర్వాహకులు బహిరంగంగానే చెప్పారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్దామని కూడా ఫార్ములా ఈ రేస్ సంస్థ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆర్బిట్రేషన్‌కు వెళ్లి కేసు గెలిస్తే ఆ సంస్థ తెలంగాణ నుంచి పంపిన నిధులను వెనక్కి పంపిస్తుంది. అయితే, ఆ సంస్థతో మాట్లాడే ధైర్యంలేని ప్రభుత్వం ఇక్కడ కేసులు పెట్టాలని చూస్తున్నది. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్‌కు వెళ్లిన తర్వాత అందులో అవినీతి ఎక్కడున్నదని కేటీఆర్ మొదట్నుంచీ ప్రశ్నిస్తున్నారు. అవినీతే లేని ఈ కేసులో తాను లై డిటెక్టర్ టెస్ట్‌కు సైతం సిద్ధమంటూ అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. అనేక సందర్భాల్లో, అనేక వేదికలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తూనే ఉన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే ఈ కేసును కొనసాగిస్తున్నారని, కక్ష సాధింపుచర్యలకు ఇంతకంటే మరో నిదర్శనం ఉండదని చెప్తూవస్తున్నారు. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నది.
1) ఫార్ములా-ఈ రేస్ అంటే ఏంటి?
– ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పదేండ్లుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్యూట్లల్లో ఫార్ములా-ఈ కార్ రేసులు నిర్వహిస్తున్నారు.
2) ఇప్పటివరకు ఫార్ములా-ఈ రేసులు ఎకడ జరిగాయి?
– లండన్, బీజింగ్, సియోల్, మాసో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో ఇప్పటికే వందకు పైగా ఫార్ములా-ఈ రేసులు జరిగాయి.
3) ఫార్ములా-ఈ రేస్ వల్ల జరిగే లాభాలేంటి?
– ఫార్ములా-ఈ రేస్ జరిగిన ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700 శాతానికి పైగా పెరిగింది. ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరగడం, టూరిజం ఆదాయం పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు జరిగింది. పలు సీజన్లలో సుమారు 50 కోట్ల మంది ఈ పోటీలను వీక్షించారు. నెట్ జీరో కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ ఈ ఫార్ములా-ఈ రేస్. హైదరాబాద్ నగరానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది.
4) అసలు హైదరాబాద్ నగరానికి ఫార్ములా-ఈ రేస్ ఎలా వచ్చింది?
– ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంపొందించడానికి, ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు. రాబోయే సీజన్లలో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా-ఈ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
5) హైదరాబాద్ నగరానికి ఫార్ములా-ఈ రేస్ ఎందుకు వచ్చింది?
– పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులను ఆకర్షించాయి. వరుసగా ఐదుసార్లు హైదరాబాద్ మోస్ట్ లివెబుల్ సిటీగా గుర్తింపు పొందడం. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022 గెలుచుకోవడం. హరితహారం ద్వారా 6.5 కోట్ల మొకలు నాటడం. తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్‌ను పెంచడం వంటి ఘనతలు కూడా హైదరాబాద్ లో రేస్ నిర్వహించేందుకు కొన్ని కారణాలు.
6) అసలు హైదరాబాద్ నగరంలో రేస్ ఎందుకు నిర్వహించారు?
– పెట్టుబడుల ఆకర్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించిన రంగాల్లో ఆటోమొబైల్ రంగం ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణ రాష్టాన్ని హబ్ గా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ-మొబిలిటీ వీక్ నిర్వహించింది. ఈ వారోత్సవాల్లో భాగంగానే ఫార్ములా-ఈ రేస్ నిర్వహించింది. ఈ-మొబిలిటీ వీక్ సందర్భంగా హ్యుండాయ్, అమరరాజ వంటి దిగ్గజ కంపెనీలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు ప్రకటించారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు లభిస్తాయి.
7) హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వల్ల జరిగిన లాభాలు?
– ప్రఖ్యాత నీల్సన్ సంస్థ స్టడీ ప్రకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్ళు, ప్రకటనలు, మీడియా కవరేజీ తద్వారా రూ.700 కోట్లకు పైగా బిజినెస్ ఫార్ములా ఈ-రేస్ సమయంలో హైదరాబాద్ లో జరిగింది. పలు దేశాలు, రాష్ట్రాల నుండి 35,000 మందికి పైగా హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ను వీక్షించారు. ఫార్ములా-ఈ రేసును నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది. భారతదేశంలో ఫార్ములా-ఈ రేస్ జరిగిన మొదటి నగరంగా ఘనత సాధించింది.
8) ఫార్ములా-ఈ రేస్ కు సంబంధించిన రూ. 55 కోట్ల డబ్బును కేటీఆర్ దుర్వినియోగం చేశారా?
– అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే కేవలం రేస్ నిర్వహణ కోసమే పారదర్శకంగా ఒక ప్రభుత్వ బ్యాంక్ ద్వారా 55 కోట్ల రూపాయలను హెచ్ఎండీఏ నుంచి రేస్ నిర్వాహకులకు బదిలీ చేశారు. ఆయన ఎక్కడా అవినీతికి పాల్పడలేదు.
9) అసలు హెచ్ఎండీఏ డబ్బులు ఎందుకు బదిలీ చేసింది?
– ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి సంవత్సరం ఈవెంట్‌కు గ్రీన్ కో వంటి సంస్థల నుండి స్పాన్సర్ షిప్ లను పొందింది. అయితే, ఫిబ్రవరిలో 2024 లో జరగాల్సిన రెండవ రేస్‌కు వివిధ కారణాల చేత స్పాన్సర్ షిప్ సమస్యలు తలెత్తాయి. 2024 జూన్-జూలై నాటికి.. అంటే సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, స్పాన్సర్ లు లేకుండా తాము రేస్ ను నిర్వహించలేమని సదరు సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రతిస్పందనగా, అప్పటి మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 2024 నాటికి రేస్ నిర్వహణకు స్పాన్సర్ షిప్‌లను పొందుతామని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. రేస్ వేరే నగరాలకు వెళ్లకూడదన్న ఉద్దేశంతో హెచ్ఎండీఏ నుండి రూ. 55 కోట్ల నిధులను తాతాలికంగా నిర్వాహకులకు బదిలీ చేశారు.
10) హెచ్ఎండీఏకు డబ్బులు బదిలీ చేసే అధికారముందా?
– ఫార్ములా-ఈ రేస్‌కు హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. కేవలం రేస్ విజయవంతం అవ్వాలన్న ఉద్దేశంతోనే, కేటీఆర్ ఆదేశాలతోనే, తమ పరిధికి లోబడే హెచ్ఎండీఏ 55 కోట్ల రూపాయలను ఫార్ములా-ఈ నిర్వాహకులకు బదిలీ చేసింది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉండే హెచ్ఎండీఏ ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ. హెచ్ఎండీఏ నిధులు వాడుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి ఆమోదం అవసరం లేదు.
11) ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బు బదిలీ ఎలా జరిగింది?
– ఎన్నికల కోడ్ అనేది.. కోడ్ ఉన్న సమయంలో ఏదైనా కొత్తగా ప్రారంభిస్తే వర్తిస్తుంది. ఈ రేసుకు సంబంధించిన ఒప్పందం 2022లో చేసుకున్నదే. కాబట్టి అప్పటికే కొనసాగుతున్న వాటికి ఎన్నికల కోడ్ తో సంబంధం లేదు. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే కేసు వేయాల్సింది ఎన్నికల సంఘం తప్ప ఏసీబీ కాదు.
12) డబ్బును విదేశీ కరెన్సీలో ఎందుకు పంపారు ?
– మంత్రి హోదాలో కేటీఆర్ కేవలం రేసు ఆగకూడదు అనే ఉద్దేశంతో డబ్బు బదిలీ చేయమని హెచ్ఎండీఏను ఆదేశించాడు. అంతే తప్ప విదేశీ కరెన్సీలో పంపాలా? లేక ఇండియన్ కరెన్సీలో పంపాలా? అనే టెక్నికల్ అంశాలను అధికారులు చూసుకుంటారు. డబ్బును అత్యంత పారదర్శకంగా, ఒక ప్రభుత్వ బ్యాంక్ ద్వారానే రేస్ నిర్వాహకులకు బదిలీ చేశారు. నగదు బదిలీలో టెక్నికల్ గా ఏవో చిన్న పొరపాట్లు జరిగాయని ఆర్బీఐ సూచిస్తే దానికి సంబంధించిన ఫైన్ కుడా ప్రభుత్వం కట్టింది.
13) తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటి?
– రేస్ నిర్వాహకులతో దీర్ఘకాలిక ఒప్పందం నుండి వైదొలగాలనే రేవంత్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల రూ. 55 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది. కేవలం కేటీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనే ఒక కుట్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తీవ్ర విఘాతం కలిగింది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు ఫార్ములా-ఈ రేస్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహించాలంటేనే భయపడే స్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది.
14) రేస్ రద్దవ్వకుండా ఉండటానికి నిర్వాహకులు ప్రయత్నించారా?
– హైదరాబాద్ లో 2023 లో జరగవలసిన రేస్‌ను రద్దవ్వకుండా ఉండటానికి నిర్వాహకులు శాయశక్తులా ప్రయత్నించారు. ఫార్ములా-ఈ సంస్థ కో ఫౌండర్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కానీ ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టింది. ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మిగితా డబ్బును చెల్లించకపోవడంతో రేస్ రద్దయింది.
15) అసలు కేటీఆర్ తప్పేమి లేకున్నా ఏసీబీ కేసు ఎందుకు నమోదు చేసింది?
– కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను కేటీఆర్ ఎత్తిచూపుతున్నాడన్న అకసుతో, రేవంత్ ప్రోద్బలంతోనే ఏసీబీ కేసు నమోదు చేసింది తప్ప.. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో కేటీఆర్ చేసిన నేరమేమి లేదు. డబ్బు నేరుగా నిర్వాహకుల బ్యాంక్ అకౌంట్లోనే జమయ్యింది. ఎటువంటి మనీ లాండరింగ్ కానీ ఇంకోటి కానీ జరగలేదు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన కేసీఆర్ దూరదృష్టితోనే హైదరాబాద్‌కు నాడు ఫార్ములా-ఈ, మొన్న మిస్ వరల్డ్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు వచ్చాయి. ఈ రెండు ఈవెంట్లతో ప్రపంచ దేశాలు తెలంగాణ రాజధాని వైపు చూశాయి. అయితే, ఫార్ములా -ఈ రేసు నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకపోగా.. వందల కోట్ల ఆదాయం వచ్చింది. ప్రపంచంలోనే టాప్ నగరాలుగా పేరున్న దేశాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన రేస్‌ను, తమ దేశాల అతిథితులు, రేసర్లులకు చేసిన ఏర్పాట్లపై విశ్వవేదికలపై ఎంతో గొప్పగా చెప్పాయి. సినిమా, కళా రంగాలవారు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు అనేక మంది హైదరాబాద్‌కు వచ్చి రేసును చూసి వెళ్లారు. రేసు జరిగిన తీరుపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విషయం అంతర్జాతీయంగా ఉన్న అనేక మీడియా సంస్థల్లో కూడా వచ్చింది. తెలంగాణకు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ తదుపరి వ్యాపార గమ్యస్థానంగా తెలంగాణను ఎన్నుకుంటామని కూడా ప్రకటించారు. అయితే, ఈ రేసు నిర్వహణలో అవినీతి ఉందంటూ కేవలం రాజకీయ కక్షతో, ఊహాజనితంగా ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై కేసు కూడా పెట్టించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టనట్టు ఆఖరికి 18 నెలల్లో ఏమీ తేల్చలేకపోయారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించింది. అందాల పోటీల నిర్వహణతో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు కూడా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, ప్రభుత్వం పోటీల నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరించింది. దీంతో అందాల పోటీలు తెలంగాణను అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునేలా చేశాయి. తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా గంగలో కలిసింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ.. తనతో మిస్ బిహేవ్ చేశారని అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. మిస్ ఇంగ్లాండ్ చెప్పిన మాటల ఆధారంగా చర్యలు తీసుకోవల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పెండ్లి వేడుకలు హాజరవడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు ఆ ఈవెంట్‌ను నిర్వహించిన ఓ ఐఏఎస్ అధికారి.. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ మధ్యలోనే థాయ్‌లాండ్‌కు వెళ్లడం, ఆ తర్వాత ఆ దేశానికి చెందిన యువతిని ఎంపిక చేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఇవన్నీ ఒకెత్తయితే రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల నిర్వహణతో తెలంగాణకు రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయంటూ చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. ప్రకటనలు రాకపోగా పరువు పోయింది. దీంతో రాజకీయ విశ్లేషకులు నాటి ఫార్ములా ఈ రేసు, నేటి ప్రభుత్వం నిర్వహించిన అందాల పోటీని పోల్చి చెప్తున్నారు. నాడు వందల కోట్లు వచ్చిన రేస్‌ను పక్కనపెట్టి.. ఇటీవల రూపాయి ఆదాయం రాని అందాల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా ఖర్చు చేసినంత కూడా ఆదాయం రాకపోవడంతో.. ఎంతో ప్రతిష్టాత్మకమనుకున్న ఈవెంట్ ఆఖరికి అభాసుపాలైంది.
1) ఫార్ములా-ఈ రేస్ విషయంలో ఏసీబీ, ఈడీ కేసులు
2) తప్పుడు ప్రచారం చేశారని బోడుప్పల్లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.. కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై కేసు
3) చార్మినార్ వద్ద తెలంగాణ చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించొద్దంటూ నిరసన చేపట్టినందుకు అనుమతి లేకుండా ఆందోళన చేశారని కేటీఆర్‌పై కేసు
4) తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం వద్ద డ్రోన్ ఎగురవేశారని కేసు
5) మంత్రి కొండా సురేఖ, తాను ఉన్న ఫొటోలను తప్పుడు ప్రచారానికి వాడుకున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీశ్‌రావుపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు
6) మేడిగడ్డ బరాజ్‌పై డ్రోన్ ఎగురవేశారని భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్, బాల్కసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు
7) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ముషీరాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు
8) ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అన్నందుకు సైఫాబాద్‌లో కేటీఆర్‌పై కేసు
9) మహారాష్ట్ర ఎన్నికలు, మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఉట్నూర్ పీఎస్‌లో కేసు
10) అమృత్ టెండర్లకు సంబంధించి సృజన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు కేటీఆర్‌కు లీగల్ నోటీసులు
11) 2024 మార్చిలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్‌పై హన్మకొండలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు.. బంజారాహిల్స్ పీఎస్‌కు బదలాయింపు.. దానిపై 504, 505(2) సెక్షన్ల కింద కేసులు
12) లగచర్లలో ఫార్మాసిటీ రద్దు కోసం పోరాడిన పట్నం నరేందర్‌రెడ్డి చెప్పని విషయాలను కేటీఆర్‌కు సంబంధం ఉన్నట్టు ప్రభుత్వం కట్టుకథ అల్లి ఇరికించే ప్రయత్నం
13) ఫార్ములా -ఈ కార్ రేస్‌పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ అనంతరం ఇంటికి వెళ్తున్న కేటీఆర్‌ను కార్యకర్తలు ర్యాలీగా తీసుకెళ్లగా ట్రాఫిక్ ఎస్సై గోవర్ధన్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేటీఆర్‌తో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్, క్రిశాంక్, జైసింహా, మన్నె గోవర్ధన్‌పై కేసు నమోదు
14) సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేశారనే అభియోగంపై మొయినాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు
15) సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డిపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు