హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కందులు, శనగల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్క్‌ఫెడ్ రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాలను ఏర్పాటుచేసి వీటిని సేకరిస్తున్నది. గురువారం వరకు రూ.7 కోట్ల విలువైన 1,119 క్వింటాళ్ల కందులు, రూ. 7.85 కోట్ల విలువైన 1,501 క్వింటాళ్ల శనగలు సేకరించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఈ కేంద్రాల్లో రైతులకు ప్రభుత్వం మద్దతు ధరను అందిస్తున్నది. ప్రస్తుతం కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.6,300, శనగలకు రూ.5,230గా ఉన్నది. వానకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు భారీగా కంది, శనగ పంటలను సాగు చేశారు. 7.71 లక్షల ఎకరాల్లో కంది పంట, 3.43 లక్షల ఎకరాల్లో శనగ వేశారు. దీంతో ఉత్పత్తి కూడా భారీగా పెరగనున్నది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తితో సంబంధం లేకుండా నామినల్‌గా కొనుగోలుకు అంగీకరించింది. కందులు 4.67 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా, కేంద్రం 80 వేల టన్నులు మాత్రమే తీసుకొనేందుకు అంగీకరించింది. శనగ 2.31 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా, 58,485 టన్నులు సేకరిస్తామని తెలిపింది. దిగుబడి అధికంగా వస్తున్న నేపథ్యంలో మరింత కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని మార్క్‌ఫెడ్ కేంద్రాన్ని కోరనున్నదని తెలిసింది.