హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఆ బీమా ప్రీమియం గడువు నిరుడు అక్టోబర్ 8నే ముగిసినప్పటికీ ఇంకా చెల్లింపులు జరపకుండా తాత్సారం చేస్తున్నది. దీంతో దాదాపు 454 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.22.7 కోట్లు పెండింగ్‌లో పడటంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 13,11,072 మంది లబ్ధిదారులకు బీమా రక్షణ లేకుండా పోయింది. దీనిపై ట్రాన్స్‌పోర్టు, నాన్-ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లతోపాటు ఆటోడ్రైవర్లు, హోంగార్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్మిక, రవాణాశాఖల మధ్య సమన్వయ లోపం వల్లే తమకు సామాజిక భద్రత లేకుండా పోయిదని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రీమియంను చెల్లించాలని, తమ బీమా పాలసీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 2015లో మేడే సందర్భంగా కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటివరకు వందల కుటుంబాలు లబ్ధి పొందాయి.