హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్‌పోర్టులు పొందిన కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ ఆదివారం చెప్పారు. తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్‌పోర్టు వ్యవహారం బయటపడినట్టు తెలిపారు. అదే తరహా మోసాలు చాలా రాష్ర్టాల్లోనూ ఉన్నట్టు తాము గుర్తించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని దగ్గరుండి మరీ ఏజెంట్లే ప్రోత్సహించారని, వారి ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయని తెలిపారు.
వివిధ జిల్లాల్లోని బ్రోకర్లతోపాటు ప్రధాన పాస్‌పోర్ట్ ఏజెంట్ అయిన తమిళనాడుకు చెందిన మురళీధరన్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పాస్‌పోర్టు విచారణ అధికారులు లం చాలు తీసుకోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పాస్‌పోర్టు బ్రోకర్లను అరెస్టు చేసినట్టు ఆమె తెలిపారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచే ఎక్కువగా నకిలీ ధ్రువపత్రాల ద్వారా పాస్‌పోర్టులు పొందినట్టు తమ విచారణలో కనుగొన్నామని వెల్లడించారు. పాస్‌పోర్టుల జారీలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు.