Runa Mafi | జనగామ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వారంతా ఆందోళనలో ఉన్నారు. మేం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకంపై పర్యవేక్షణ సరిగా లేదు. మీ వల్ల ప్రభు త్వం బద్నాం కావాలా?’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లీడ్‌బ్యాంక్, వ్య వసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్ లో లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, నవాబ్‌పేట గ్రామాల రైతుల రుణమాఫీలో తలెత్తిన సాంకేతిక సమస్యపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్, లీడ్బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలిసి సమీక్షించారు.
తన నియోజకవర్గ పరిధిలోని నవాబ్‌పేటకు చెందిన 800 మంది, నెల్లుట్లకు చెందిన సుమారు 400 మంది రైతులకు కెనరా బ్యాంక్ ద్వారా రుణమాఫీ కాలేదని, దీనికి ఎవరు బాధ్యులు అని కడియం మండిపడ్డారు.‘మీపర్యవేక్షణ లోపం వల్ల మేం బద్నాం కావాలా?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.