హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో యూనివర్సిటీ అధ్యాపకులు 56 మంది, పాఠశాల విద్యాశాఖలో 49 మంది, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 11 మంది, సాంకేతిక విద్యాశాఖలో నలుగురిని ఎంపిక చేసింది. వీరికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పురస్కారాలు ప్రదానం చేసి శాలువాతో సత్కరించనున్నారు.
120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖలో ప్రిన్సిపాల్ కేటగిరీలో రిటైర్డ్ టీచర్ బీ రాజగోపాల్( శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)కు అవార్డు ప్రకటించింది. రిటైర్డ్ టీచర్‌కు ఉత్తమ పురస్కారం ఇవ్వడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నడూ విరమణ ఉపాధ్యాయుడిని ఎంపిక చేయలేదని గుర్తుచేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యమా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఎంపిక చేసిందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం విడుదల చేసిన గురుపూజోత్సవం ఆహ్వాన పత్రికలో సర్వేపల్లి రాధాకృష్ణ పేరులేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సైతం టీచర్స్ యూనియన్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.