NIMS | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. తండ్రేమో దినసరి కూలీ. తల్లేమో ఇంట్లోనే ఉంటుంది. దినదినమే గడవడం కష్టంగా మారిన ఆ పేద దంపతులకు జన్మించిన ఓ బాలుడు పుట్టుకతోనే మూత్రపిండాల సమస్య బారిన పడ్డాడు. కుమారుడిని ఆ వ్యాధి నుంచి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు తల్లిదండ్రులు. ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు( NIMS Doctors ) ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో.. ఆ తల్లే మరోసారి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కుమారుడికి కిడ్నీ దానం చేసి మళ్లీ జీవం పోసింది.
మహబూబ్‌నగర్ జిల్లా( Mahabubnagar Dist )కు చెందిన ఈ పేద దంపతులు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వీరికి జన్మించిన బాలుడు పుట్టుకతోనే బైలాటరల్ వెసికోయూరెటిరిక్ రిఫ్లక్స్ అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఎడమ వైపు కిడ్నీ కూడా ఫెయిలైంది. దీంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రులను సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్‌లో తమ 12 ఏండ్ల కుమారుడిని చేర్పించారు.
దఫదఫాలుగా బాలుడికి చికిత్సలు నిర్వహించారు నిమ్స్ వైద్యులు. ఎడమ వైపు కిడ్నీని తొలగించారు. రెండో దశలో తల్లి దానం చేసిన కిడ్నీని కుమారుడికి విజయవంతంగా మార్పిడి చేశారు. ప్రస్తుతం తల్లీకుమారుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా యూరాలజీ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేయడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద బాలుడికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని, మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. సీరం క్రియాటిన్ లెవల్ 7 నుంచి 0.4 స్థాయికి చేరుకుందన్నారు. తల్లీ కూడా ఆరోగ్యంగా ఉందన్నారు.
ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో యూరాలజిస్టులు ప్రొఫెసర్ డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ హర్ష, డాక్టర్ జానకి, డాక్టర్ పవన్, డాక్టర్ సూరజ్, డాక్టర్ పువారసన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూఖ్, అనస్థీయా టీమ్ డాక్టర్ నిర్మల, డాక్టర్ ఇందిర, డాక్టర్ కిరణ్, డాక్టర్ షిబానీ, నెఫ్రాలజిస్టులు డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ గంగాధర్, డాక్టర్ భూషణ్ రాజు భాగస్వాములయ్యారు.
ఈ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప శుభాకాంక్షలు తెలిపారు.