MLC Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 3, బీఆర్ఎస్ పార్టీకి ఒకటి చొప్పున మొత్తం నాలుగు స్థానాల విషయంలో స్పష్టత నెలకొన్నది. ఇక మిగిలిన ఐదో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిలకు సంబంధించి మార్చి 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలై మార్చి 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలు ఐదుగురిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోనున్నారు.
ఈసారి ఎన్నిక తప్పదా?
తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక విషయంలో ఇప్పటివరకు పోలింగ్ జరగలేదు. తెలంగాణ తొలి శాసనసభ కొలువుదీరినప్పటి నుంచి ఎమ్మెల్యే కోటా ఎన్నిక విషయంలో పోలింగ్ జరిగిన దాఖలా లేదు. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, శాసనసభలో పార్టీల బలాబలాలు చూస్తే ఎన్నిక తప్పదనే వాతావరణం నెలకొన్నదని రాజకీయవర్గాలు అంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి (మార్చి 13వ తేదీ) ఐదు కన్నా ఒక్క నామినేషన్ ఎక్కువ దాఖలైనా పోలింగ్ అనివార్యమవుతుంది. తెలంగాణ శాసనమండలికి ఇప్పటి వరకు ఏకగ్రీవంగానే సభ్యులు ఎన్నికవుతూ వచ్చారు. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఒక ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేలు
నిష్పత్తి ఆధారిత దామాషా ప్రకారం ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానంలో ఎమ్మెల్యే ఓటును లెక్కిస్తారు. ఈ లెక్కన రాష్ట్ర శాసనసభలో ఉన్న మొత్తం 119 మంది ఎమ్మెలేలు ఉన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, నిర్దేశిత ఓటు బదిలీ లెక్కల ప్రకారం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యే కోటా ఓటు విలువ 20.833 అంటే 21 మంది ఎమ్యెల్యేలు అవసరం. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవటానికి ఆ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు వేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా లేదా సభ్యుడు అయినా పోలింగ్‌కు దూరంగా ఉంటే ఓటు బదలాయింపు విలువ మారుతుంది.
ఐదో సీటు ఎవరికో?
రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం అసెంబ్లీ సభ్యుల సంఖ్య, నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గణిస్తే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు సొంతంగా మూడు స్థానాలు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం గ్యారెంటీ. అయితే, కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎంఐఎం, సీపీఐ తమ తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీలు సాగిస్తున్న మంతనాలను బట్టి స్పష్టమవుతున్నది. ఒకవేళ అదే నిజమైతే తన 65 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తమవైపు నిలబడతారు? అని కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది.
దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను నమ్ముకుంటే ఏ మేరకు లాభం? తమ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలకు తోడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్లేటు పిరాయిస్తే కాంగ్రెస్‌కు ఖాయంగా వస్తాయనుకున్న 3 సీట్లు కూడా దక్కుతాయో లేదో అన్న అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది. ఇక బీఆర్ఎస్కు నికరంగా ఉన్న 28 మంది ఎమ్మెల్యేలకు తోడు ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలనూ కలిపితే 38 మంది. ఈ సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలిపితే కాంగ్రెస్ ఆశలకు గండిపడటం పక్కా అని రాజకీయ వర్గాలు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజావ్యతిరేకత, రాజకీయ వాతావరణం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసమ్మతి, ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మారుతున్న ‘మనసు’.. ఆ ఐదోసీటును ప్రభావితం చేయవచ్చని వారు విశ్లేషిస్తున్నారు.