నారాయణఖేడ్, నవంబర్ 30: ‘రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరకం పంటకే నగదు సాయం ఇవ్వాలని చూస్తున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. దీంతో ఈసారి సుమారు 70 లక్షల ఎకరాల దీర్ఘకాలిక పంటలకు రైతుభరోసా ఇవ్వకుండా ఎగవేసే కుతంత్రానికి సర్కారు తెరలేపింది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆదివారం హరీశ్‌రావు పర్యటించారు. అనంతరం నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సాగుచేసిన భూమికే రైతు భరోసా ఇస్తామన్న మంత్రి మాటల్లో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ లెక్కన దీర్ఘకాలిక పంటలైన పత్తి, కంది, చెరకు, పసుపు, పండ్లతోటలు తదితర పంటలు సాగు చేస్తున్నవారికి రైతు భరోసా రాదని తేలిందని చెప్పారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒకసారి అరకొరగా రైతుభరోసా ఇవ్వగా, మరోసారి పూర్తిగా ఎగ్గొట్టిందని తెలిపారు.
ఈసారి సుమారు ఆ 70 లక్షల ఎకరాల్లో సాగయిన దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగవేసే యత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం 11 దఫాలు రెండు పంటలకు అదునుకు రైతుబంధు సాయం ఇచ్చిందని చెప్పారు. తాము మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి.. ఇప్పుడు ఒక్క పంటకే కుదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సోయా, మక్క పంటలను కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. 48 రోజులైనా ఇవ్వని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన సోయా పంటను కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్నారని తెలిపారు. గత యాసంగిలో కొనుగోలు చేసిన సన్న వడ్ల బోనస్‌ను ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని, రూ.1,150 కోట్ల సన్న వడ్ల బోనస్‌ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్ల బోనస్, రైతుబీమా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఒక నిర్దిష్టమైన విధానమేదీ రేవంత్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు.
త్వరలో ప్రాజెక్టుల కోసం పాదయాత్ర
‘సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను రేవంత్ ప్రభుత్వం నిలిపివేసింది. సత్వరమే ఆ ప్రాజెక్టుల పనులను ప్రారంభించాలి. లేదంటే ఆ రెండు ప్రాజెక్టుల కోసం త్వరలో తాను పాదయాత్ర చేపడతా’ అని హరీశ్‌రావు వెల్లడించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి 8 కొత్త చెరువులను మంజూరు చేసి భూసేకరణ పూర్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పనులు చేపట్టడమే లేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాపై ఎందుకు చిన్నచూపు ప్రదర్శిస్తున్నారో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ మండలం అనంతసాగర్, మండల కేంద్రమైన సిర్గాపూర్‌లో నిర్వహించిన మల్లన్న జాతర ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు మల్కాపురం శివకుమార్, మఠం భిక్షపతి, శ్రీకాంత్‌గౌడ్, మోయిద్‌ఖాన్ తదితరులు ఉన్నారు.
ముద్విన్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక
కడ్తాల్, నవంబర్ 30: హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలు, బీఎస్సీ మండల నాయకుడు మహేశ్ సహా పలువురు ఆ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. వారందరికీ హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ముద్విన్, కడ్తాల్ గ్రామాల అధ్యక్షులు రాజు, రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ వినోద్, నాయకులు రాఘవరెడ్డి, గోపాల్, శ్రీనివాస్, జంగయ్య, వెంకటయ్య, కృష్ణయ్య, సతీశ్, సైదులు, హరి, యాదయ్య, జగన్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.