హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.330 కోట్ల ఆర్థిక సహాయాన్ని బీసీ విద్యార్థులకు అందజేసింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల దాకా సా యం చేస్తున్నది. ఏటా జనవరిలో 150 మంది, సెప్టెంబర్‌లో 150 మంది చొప్పున సంవత్సరానికి 300 మందిని ఎంపిక చేస్తున్నారు. మొత్తం సీట్లలో ఆర్థికంగా వెనుకబడినవారికి 30 సీట్లు కేటాయిస్తున్నారు. ఈ పథకం వెన్నుదన్నుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు సైతం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా లాంటి దేశాలకు వెళ్లి మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద సెప్టెంబర్ సీజన్‌కు సంబంధించిన దరఖాస్తులను బీసీ సంక్షేమశాఖ స్వీకరిస్తున్నది. బీసీ అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ల కోసం <http://www.telanganaepass.cgg.gov.in> వెబ్సైట్ సంప్రదించాలని బీసీ సంక్షేమశాఖ సూచించింది.