Liqour Shops Tender | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తం గా 1,12,500 దరఖాస్తులు వచ్చా యి. ఇందులో అత్యధికంగా శంషాబాద్లో 8,409 కాగా, అత్యల్పంగా నిర్మల్లో 657 దరఖాస్తులు రావడం గమనార్హం. రెండేండ్ల క్రితం 79 వేల దరఖాస్తులు రాగా ఈసారి వాటి సంఖ్య భారీగా పెరగడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షల చలాన్ (డీడీ)తో దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడలకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలను కేటాయించారు. మిగతా 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ క్యాటగిరీ కింద ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.