నాగర్‌కర్నూల్, జూలై 27 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం పరిధిలోని ఉ య్యాలవాడ సమీపంలో ఉన్న మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 111మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి క్యాబేజీ కూర, పకోడి, పెరుగుతో భోజనం చేసిన విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు.విషయంలో సిబ్బందికి చెప్పగా ట్యాబ్లెట్స్ ఇచ్చి, దవాఖానకు తరలించడంలో నిర్లక్ష్యంచేశారు. ఆదివారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో వారికి ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలిసింది. దీంతో వారు 108 అంబులెన్స్‌లో విద్యార్థులను నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అందులో 12 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేశారు. దవాఖానలో బెడ్లు లేక ఒకే మంచంపై ముగ్గురిని కూర్చొబెట్టి వైద్యం అందించారు. విద్యార్థులను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు నయం కాకపోయినా డిశ్చార్జి చేసి పాఠశాలకు పంపించారు. కేవలం ఐదుగురికి మా త్రమే దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల అత్యుత్సాహం..హైడ్రామా సృష్టించి విద్యార్థినుల డిశ్చార్జి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు విద్యార్థినులను పరామర్శించడానికి వస్తున్నారని తెలుసుకు న్న అధికార యంత్రాంగం హైడ్రామా సృష్టించారు. ఓ గేటు నుంచి నాగం జనార్దన్‌రెడ్డి దవాఖాన లోపలికి వెళ్తుండగా మరో దారి నుంచి విద్యార్థినులను 102 (అమ్మ ఒడి) వాహనంలో బలవంతంగా పాఠశాలకు తరలించారు. ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. నాగం పరామర్శకు వెళ్లిన సమయంలో కేవలం ఐదుగురు విద్యార్థినులు మాత్రమే చికిత్స పొందుతున్నట్టుగా, అందరికీ నయమైనట్టు చిత్రీకరించారు. మీడియాను సైతం విద్యార్థినులను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
క్యాటరింగ్ కాంట్రాక్టు రద్దు: కలెక్టర్ బాదావత్ సంతోష్
ఉయ్యాలవాడలో బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తూ, డిప్యూటీ వార్డెన్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. త్వరలోనే కొత్త ప్రిన్సిపాల్‌ను నియమించనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, మెరుగైన వసతులు కల్పించడానికి చర్యలను తీసుకుంటామని కలెక్టర్ హామీఇచ్చారు.