నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం చెందారు. అతివేగం, అజాగ్రత్త కారణంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిశాయి. ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ఖమ్మం ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ (అల్లీపూర్)కు చెందిన ఆటో డ్రైవర్ యాకూబ్ పాషా అలియాస్ బబ్లూ (25), హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మం డలం దండేపల్లికి చెందిన పల్లపు పద్మ (35), వల్లపు మీన (37) అక్కడికక్కడే మృతి చెందారు. హనుమకొండ జిల్లా పరిధిలో బ్రిడ్జి పైనుంచి కారు బోల్తా పడ గా దంపతులు దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాడూరి సారయ్య తన భార్య సుజాతతో కలిసి ఆదివారం ఖమ్మం నుంచి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లికి కారులో బయ లుదేరారు. వరంగల్ హంటర్‌రోడ్డు బ్రిడ్జిపై ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా పైకి లేసి 40 ఫీట్ల కిందకు పడింది. ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే చనిపోగా, సారయ్యను ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనం పై ఉన్న ఎర్రాయిగూడేనికి చెందిన ఈసం హనుమంతు (35), ఈసం స్వామి (40) దుర్మరణం చెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం లో శనివారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు మరణించారు.
కరీంనగర్ రూరల్ మండలం సీతారాంపూర్‌కు చెందిన అజిత్, ప్రవీణ్ ఇద్దరు స్నేహితులు. మంచిర్యాలలో ఓ శుభకార్యానికి హాజరై వరంగల్ మీదుగా కరీంనగర్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. మేడ్చల్ జిల్లా సూరారంలో టిప్పర్, డీసీఎం వాహనం ఢీకొనడంతో క్లీనర్ దుర్మరణం చెందాడు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన మహమ్మద్ మోతాబ్బిర్ (21) డీసీఎం వాహన క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం నర్సాపూర్ వెళ్లి వస్తుండగా సూరారంలోని జ్యోతిమిల్క్ సమీపంలో ఓ టిప్పర్ డ్రైవర్ ఇండికేటర్ వేయకుండా యూటర్న్ తీసుకొంటుండగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం.. టిప్పర్‌ను ఢీకొన్నది. దీంతో డీసీఎం వాహన క్లీనర్ మరణించాడు.
మొండెం నుంచి వేరైన తల..
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సాగర్ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. పాలవ్యాను ఢీకొనడంతో ఓ వ్యక్తి మొండెం నుంచి తల వేరైంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన మాదగోని చిన్న బుచ్చయ్య గౌడ్ (58) ఇబ్రహీంపట్నం నుంచి బైక్‌పై శివన్నగూడకు వెళ్తుండగా యాచారం వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పాల వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బుచ్చయ్య గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే అతడి తల కన్పించలేదు. పోలీసులు, స్థానికులు వెతుకగా చాలాసేపటి తరువాత రోడ్డు పక్కన ముళ్లపొదల్లో గుర్తించారు.