కోస్గి, జనవరి 24: నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ శిరీషపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం కోస్గి మున్సిపల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మా న ప్రక్రియను ఆర్డీవో రాంచందర్‌నాయక్ సమక్షంలో ఉదయం 11 గంటలకు మున్సిపల్ సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా కాంగ్రెస్‌కు చెందిన 11 మంది కౌన్సిలర్లు హాజరై చేతులు ఎత్తి అవిశ్వాసాన్ని బలపర్చడంతో తీర్మానం నెగ్గింది. అయితే కొంత సమయం తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే విధించిందని బలనిరూపణ నిలిపివేయాలని ఆర్డీవోను కోరగా బల నిరూపణ పూర్తయ్యిందని ఆర్డీవో ప్రకటించారు. మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే ఒకరు మరణించగా, మరొకరు డిస్క్వాలిఫై అయ్యారు. ఎన్నికల ముందు వైస్‌చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో మొత్తం 11 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష పదవిని కోల్పోగా ఆమె స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బెజ్జు సంగీతారాములును కొద్ది రోజుల్లో ఎంపిక చేయనున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.