Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో చిన్నారులపై జరుగుతున్న వరుస ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా, బడికి పంపాలన్నా తల్లిదండ్రులు బెంబేలెత్తిపోవాల్సిన దుస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ హైదర్షాగోట్లో నెల క్రితం పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు ఇంటర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం శుక్రవారం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇబ్రహీంపట్నం సమీపంలోని సీతారాంపేట్గేట్ లయోలా స్కూల్ హాస్టల్లో ఉంటున్న బాలికపై ఈ నెల 6న ప్రిన్సిపాల్ దినావన్రావు అఘాయిత్యానికి యత్నించాడు.
బాలిక తీవ్రం గా ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుంది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ దినావన్రావను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌కు చెందిన ఇన్ఫాంట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఈ నెల 4న ఉపాధ్యాయులు పిక్నిక్కు తీసుకెళ్లారు. ఆ సమయంలో వ్యాన్ డ్రైవర్ ఒకటో తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలల్లో పిల్లలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.