హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మహర్దశ ఏర్పడిందని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఒకప్పుడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వందల్లో విద్యార్థులు ఉండేవారని, నేడు రాష్ట్రంలో 1.30 లక్షల మంది చదువుకునే స్థాయికి ఎదిగాయని వివరించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సంఘం (సీఆర్టీ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన కృతజ్ఞతా సభకు మంత్రి హాజరయ్యారు. సీఆర్టీల గౌరవవేతనం పెంచడంతోపాటు జీతాలను 12 నెలలకు వర్తింపజేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఆర్టీలకు సీఎం కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారని, తాజాగా 30 శాతం పీఆర్సీతో రూ.28, 977కు వేతనం పెరిగిందని చెప్పారు. నేడు ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సె స్సీ ఫలితాలు 95% వరకు చేరాయని, వారి రెగ్యులరైజేషన్కు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు కోవా లక్ష్మి, రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మాజీ ఎంపీ గోడం నగేశ్, బీఆర్ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్నాయక్, సీఆ ర్టీ యూనియన్ అధ్యక్షుడు మాలోతు సోమేశ్వర్, ట్రైబల్ జేఏసీ చైర్మన్ లింగాల శ్రీరాము లు, స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు.