హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌ల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలిచి, మరో రికార్డు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2016లో రూపొందించిన ‘ఇన్నోవేషన్ పాలసీ’, నాడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చూపిన చొరవ స్టార్టప్‌ల రంగంలో తెలంగాణను అజేయశక్తిగా నిలబెట్టాయి. ఈ విషయాన్ని ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)’ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. దశాబ్ధం క్రితం ‘స్టార్టప్ ఇండియా’ పాలసీని మనదేశంలో ప్రారంభించగా.. ప్రతి ఏటా జనవరి-16ను ‘జాతీయ స్టార్టప్ డే’గా కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థ ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)’ దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో స్టార్టప్‌ల ఏర్పాటు, వాటి తీరుతెన్నులపై గణాంకాలు వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో గత పదేండ్లలో 10,804 స్టార్టప్‌లు ఏర్పడ్డాయి. స్టార్టప్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర(34,444), కర్ణాటక(20,330), ఢిల్లీ(19,273), ఉత్తరప్రదేశ్(19,273), గుజరాత్(16,805), తమిళనాడు(13,105) తొలి ఆరు స్థానాల్లో నిలిచాయి. గత పదేండ్లలో రాష్ట్రంలో 368 స్టార్టప్‌లు మూతపడినట్టు కేంద్రగణాంకాలు వెల్లడించాయి.
సగభాగం మహిళలదే..!
స్టార్టప్‌ల్లో 52.6% టైర్-2, టైర్-3 నగరాల్లో ఏర్పాటయ్యాయి. బేబీ ప్రొడక్ట్‌ల నుంచి భారీ పరిశ్రమలకు సంబంధించిన మెషినరీ తయారుచేసే స్టార్టప్‌ల వరకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిలో సగం అంకుర సంస్థలకు మహిళలే డైరెక్టర్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. దేశవ్యాప్తంగా 21 లక్షల మంది స్టార్టప్‌ల ద్వారా ఉపాధి పొందుతున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. ప్రతి అంకుర సంస్థ ప్రత్యక్షంగా సగటున పది మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపింది. సెకండరీ పాఠశాలల్లో 75%, ఉన్నత విద్యాసంస్థల్లో 80% ఆంత్రపెన్యూర్షిప్ను లైఫ్స్కిల్గా బోధిస్తే, 2035 నాటికి దేశ జీడీపీలో స్టార్టప్‌ల వాటా 15% ఉంటుందని ‘ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్’ రిపోర్టు తెలిపింది. దీంతోపాటు 50 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 20 స్టార్టప్‌లు స్టాక్మార్కెట్లో లిస్టు అయినట్టు ‘ఓరియస్ వెంచర్ పార్ట్నర్స్’ తెలిపింది.
స్టార్టప్‌ల్లో అగ్రగామిగా తెలంగాణ
స్వరాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2016లో ‘ఇన్నోవేషన్ పాలసీ’ని రూపొందించింది. కొత్త ఆవిష్కరణలతో వచ్చే వారిని ప్రోత్సహించడంలో భాగంగా పటిష్టమైన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్’ను తీసుకొచ్చింది. తద్వారా ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేసింది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌ను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. కేవలం ఐటీ రంగంలోనే కాక ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసింది. స్టార్టప్ ఎకో సిస్టమ్ మెరుగుపడటానికి మానవ వనరులు అవసరమని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను కేసీఆర్ హయాంలోనే ఏర్పాటుచేశారు. టీ-హబ్ స్ఫూర్తితో వీ-హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్)ను ఏర్పాటుచేశారు. పదేండ్ల క్రితం దేశవ్యాప్తంగా కేవలం 500 స్టార్టప్‌లు ఉండగా, దశాబ్ద కాలంలో ఒక్క తెలంగాణలో 10,804 స్టార్టప్‌లు ఏర్పడటంతో కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఐటీ పాలసీలకు అద్దంపడుతున్నది. మరోవైపు నాడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చొరవతో ఐటీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను కేంద్ర గణాంకాలు తేటతెల్లం చేశాయి.
గత పదేండ్లలో వివిధ రాష్ర్టాల్లో ఏర్పాటైన, మూతపడిన స్టార్టప్‌ల సంఖ్య
