CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) పనులు లెక్క తేలింది. 33 జిల్లాల్లో 34,511 పనులను రేవంత్‌రెడ్డి సర్కారు నిలిపివేసింది. దీంతో 2014-15 నుంచి 2023-24 వరకు సుమారు రూ.10 వేల కోట్లకు పైగా విలువైన పనులకు బ్రేక్ పడింది. ప్రజల ఏండ్ల పోరాటం తర్వాత మంజూరైన అనేక పనులు మొదలు కాకముందే కాలగర్భంలో కలిసిపోయినట్టయింది. అనుమతులు లభించినా పనులు మొదలుకాలేదనే సాకుతో ప్రభుత్వం వాటిని రద్దుచేసింది. మొదలైన కొన్ని అభివృద్ధి పనులకూ సర్కారు మంగళం పలికింది. ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించొద్దని ఆదేశాలిచ్చింది. వీటితోపాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సైతం మెజార్టీ బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది.
ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు, పథకాల్లో ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేశారు. తద్వారా వేలాది పనులు ప్రారంభం కాకముందే రద్దయ్యాయి. ఒక పంచాయతీరాజ్ శాఖలోనే 2,800 పనులు మంజూరైనా ప్రారంభం కాలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. వీటి విలువ రూ.2,100 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల తదితర శాఖలపరిధిలో చేపట్టిన వేలాది పనులను ప్రభుత్వం రద్దుచేసింది. ఫలితంగా మంచిర్యాల జిల్లాలో 2,205, మెదక్ జిల్లాలో 2,145, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,094 అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. 33 జిల్లాల్లో 34,511 పనులకు రేవంత్ సర్కార్ అడ్డుకట్ట వేసింది.
అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
‘గత ప్రభుత్వం వివిధ శాఖలవారీగా ఎస్డీఎఫ్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం రద్దు చేసిందా? అత్యవసర పనులనూ రద్దుచేశారా? జిల్లాలవారీగా, శాఖలవారీగా రద్దుచేసిన పనుల వివరాలను ఇవ్వండి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కమలాకర్, కృష్ణమోహన్‌రెడ్డి, గోపీనాథ్ ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి తాజాగా ఆర్థికశాఖలోని ఫైనాన్స్, ప్లానింగ్ విభాగం సమాధానం ఇచ్చింది. 2014-15 నుంచి 2023-24 వరకు ఎస్డీఎఫ్ కింద చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను మాత్రమే రద్దు చేసినట్టు తెలిపింది. పనులకు అనుమతులు లభించినా ప్రారంభించకపోవడంతో నిలిపివేసినట్టు ప్రకటించింది. ఏమైనా అత్యవసరమైన పనులు కూడా రద్దయినట్టు ఆయా జిల్లాల యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వాటిని పరిశీలించి నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.